Outer ring train : తెలంగాణకు మరో అద్భుత వరాన్ని కేంద్రం కల్పించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణకు మరో మణిహారం వచ్చింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ చేరుకోవడం ఈజీ అవుతోంది. ఇప్పుడు ఇలానే ఔటర్ రింగ్ రైలు కూడా ఏర్పడడం అందరికీ ఊరటనిస్తోంది.
తెలంగాణకు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుపై రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.

ఆర్‌ఆర్‌ఆర్, ఔటర్ రింగ్ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ రూట్ విషయం 99శాతం కొలిక్కి వచ్చిందన్నారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రావడం దేశంలోనే తొలిసారి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

వ్యాపార, రవాణా రంగంలో ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన మార్పు వస్తుందన్నారు. విజయవాడ, గుంటూరు, వరంగల్, మెదక్, ముంబయి రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైలు కనెక్టివిటీగా ఉంటుందన్నారు.