ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. అప్పుల కోరల్లో చిక్కుకుంది. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం సైతం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో రుణాల కోసం జగన్ ప్రభుత్వం వెంపర్లాడుతోంది. జగన్ సర్కారు విధానాలనో, సీఎం జగన్ నే టార్గెట్ చేస్తూ విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఏపీలో భారీ మెజార్టీతో విజయం సాధించిన వైసీసీకి ఇప్పుడు అప్పుల భారమే మిగిలింది.
రెండేళ్ల పాలన పూర్తయినా ఇంకా మూడేళ్లు మిగిలే ఉంది. దీంతో ఈ మూడేళ్లలో ప్రభుత్వాన్ని నడపడం సవాలుగానే మారింది. దీంతో జగన్ కు ఆర్థిక ఇబ్బందులు తోడు కానున్నాయి. దీనికితోడు కరోనా ప్రభావం కూడా అన్ని స్టేట్లపై పడింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుపై ప్రతిపక్షాలకు అప్పులే సాకుగా దొరుకుతున్నాయి.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఈ కాలంలో ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేర ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేసింది. దీంతో రాష్ర్టం మరింత అప్పుల్లోకి వెళ్లింది. ఇప్పుడు కనీసం ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా రాబడి మార్గాలేవి లేకపోవడంతో ప్రభుత్వానికి ఏమి తోచడం లేదు. చివరికి తాము అధికారంలో ఉన్న సమయంతో పాటు రాబోయే 25 ఏళ్లకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
ఏపీలో అప్పులే ప్రతిపక్షాలకు సాకులుగా మారుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాష్ర్టం అధోగతి పాలైందని విమర్శిస్తున్నాయి. తాజాగా పయ్యావుల కేశవ్, జీఎల్ నరసింహారావు వంటి నేతలు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలకు అప్పుల టాపిక్ నే ఎంపిక చేసుకుని చెలరేగిపోతున్నాయి.
జగన్ చేస్తున్న అప్పులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో లభించిన ఫలితాలు చూశాక జగన్ కు బదులుగా ఆయన చేస్తున్న అప్పులను టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని టార్గెట్ చేస్తూ జగన్ ను ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి.