బీజేపీలో పరిణామాలు మారుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ వ్యవహారంపై వాడివేడి చర్చ జరుగుతోంది. గతంలో వివేక్ ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి నియోజకవర్గ నేతలు ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వివేక్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను విస్మరిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నట్లు తెలుస్తోంది. వివేక్ పై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది.
పెద్దపల్లి లోక్ సభ సెగ్మెంట్ లోని బీజేపీ నేతలు, కార్యకర్తలు కొద్దిరోజుల క్రితం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివేక్ వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగట్టారు. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన వివేక్ ను దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న తమను విస్మరిస్తున్నారని వాపోయారు. సొంతకేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. దీంతోనే వివేక్ పై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
వివేక్ ఇటీవల కోటరీ మార్చారని బీజేపీలో అంతర్గత గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా బండి సంజయ్ కి దగ్గరగా ఉన్న వివేక్ ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోటరీలో చేరారని ప్రచారం జరుగుతోంది. వివేక్ బీజేపీలో చేరిన సమయంలో రాజ్యసభ పదవి ఇస్తారనే హామీతో పార్టీలో చేరినట్లు సమాచారం. బండి సంజయ్ ని నమ్ముకుంటే పదవి వచ్చే అవకాశం లేదని భావించిన వివేక్ కిషన్ రెడ్డి కోటరీలోకి మారినట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరికలో వివేక్ కీలక పాత్ర పోషించారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఈటలతో పనిచేసిన అనుభవం ఉండటం టీఆర్ఎస్ లో ఉన్నప్పటి సంబంధాల రీత్యా ఈటల బీజేపీచేరిక వ్యవహారాన్ని ముందుండి నడిపించారు. ఈటల కిషన్ రెడ్డి మధ్య ఫామ్ హౌస్ మీటింగ్ కు అన్ని తానై వ్యవహరించారు. ఆతర్వాత ఢిల్లీ టూర్ లోనూ కీలకంగా ఉన్నారు.