https://oktelugu.com/

రైతులను చూపించి రాజకీయం చేస్తున్న ప్రతిపక్షం

రైతుల ఆందోళన 50 రోజులు దాటింది. ఢిల్లీ దిగ్బంధం అప్రతిహతంగా కొనసాగుతుంది. దీనికి పరిష్కారం కనుచూపుమేరలో కనిపించటంలేదు. ఇది ముందుగా వూహించిందే. కారణం దీనివెనక వున్న రాజకీయ శక్తులే. మావోయిస్టుల ప్రభావం రైతు సంఘాల మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా పంజాబ్ లో ఎందుకు జరిగిందో ముందు ముందు కాని తెలియదు. చాలా రైతు సంఘాల నాయకుల పూర్వరంగం ఆ సిద్ధాంత ప్రభావమేనని వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే ఈ సమస్యను సాగదీస్తారు తప్పించి పరిష్కార దిశగా […]

Written By:
  • Ram
  • , Updated On : January 14, 2021 / 06:58 AM IST
    Follow us on

    రైతుల ఆందోళన 50 రోజులు దాటింది. ఢిల్లీ దిగ్బంధం అప్రతిహతంగా కొనసాగుతుంది. దీనికి పరిష్కారం కనుచూపుమేరలో కనిపించటంలేదు. ఇది ముందుగా వూహించిందే. కారణం దీనివెనక వున్న రాజకీయ శక్తులే. మావోయిస్టుల ప్రభావం రైతు సంఘాల మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా పంజాబ్ లో ఎందుకు జరిగిందో ముందు ముందు కాని తెలియదు. చాలా రైతు సంఘాల నాయకుల పూర్వరంగం ఆ సిద్ధాంత ప్రభావమేనని వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే ఈ సమస్యను సాగదీస్తారు తప్పించి పరిష్కార దిశగా అడుగులు పడవు. దీనికి తోడు విదేశాల్లో ముఖ్యంగా కెనడా,యుకెల్లో వున్న ఖలీస్తాని వాదులు ఈ ఉద్యమం ఆరకుండా వుండాలని కోరుకుంటున్నారు. ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నారు. చివరకు అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేయటంకూడా జరిగింది. అదే పంజాబ్ లో నయితే 1500 రిలయన్స్ జియో టవర్స్ ద్వంసం చేయటం జరిగింది. అయినా వీటిపై మాట్లాడితే రైతుల్ని ఉగ్రవాదులని ప్రభుత్వం దాని మద్దతుదారులు నిందించారని రివర్స్ లో ప్రచారం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా వామపక్ష తీవ్రవాదుల ప్రభావం వున్న మేధావులు, ప్రజాసంఘాల ముసుసుగులో వున్న నాయకులు, నాయకురాళ్ళు పనిగట్టుకొని చిలవలు పలవలు అల్లి ప్రచారం చేస్తున్నారు. వరవరరావు విడుదలకు ఈ రైతు ఉద్యమానికి సంబంధం ఏమిటి? ఇందులో చివరకు సిపిఎం , కాంగ్రెస్ లు బి టీంలు గానే మిగిలిపోయారు. యోగేంద్ర యాదవ్ సంధాన కర్తగా వ్యవహరిస్తున్నాడు. దర్శన్ పాల్ సింగ్, వుగ్రవాన్ లాంటి మావోయిస్టులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మొదట్లో పంజాబ్ ముఖ్యమంత్రి చురుకుగా వెనకుండి మద్దతిచ్చినా ఇప్పుడు మాత్రం ఇబ్బందికరంగానే వున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎవరైనా అలా ఆలోచిస్తే వెంటనే వాళ్ళను చరిత్రహీనులుగా, వెన్నుబాటుదారునిగా ముద్రవేయటం జరిగిపోద్ది. ఇటువంటివి చరిత్రలో చాలా చూశాం. రాహుల్ గాంధీ పంజాబ్ ప్రభుత్వం ఏమైనా పర్వాలేదు మోడీని ఇబ్బందిపెట్టాలనే ధోరణిలో వున్నాడు. ఇంతకీ అసలు ఆ చట్టాలు అంత దారుణమైనవా?

    అపోహలపై, అబద్దాలపై ఉద్యమాన్ని నిర్మించారు 

    దీనిపై ఎన్నోరకాల ఆధారంలేని అబద్ధాలు ప్రచారం చేశారు. ఈ చట్టాల వలన భూమి పోద్దని, మండి వ్యవస్థ రద్దవుతుందని, కనీస మద్దతు ధర ఎత్తివేస్తారని ఊదరగొట్టారు. అలా అని చట్టాల్లో ఎక్కడుందో చెప్పమంటే చట్టాల్లో అలా లేకపోయినా భవిష్యత్తులో అలా జరుగుతుందని ప్రచారం చేశారు.అదేమంటే ప్రైవేటు రంగం వచ్చిన తర్వాత బిఎస్ యెన్ ఎల్ దెబ్బతిందని ప్రచారం చేస్తారు. అసలు ఈరెండింటికి పోలిక ఏమిటో అర్ధంకాదు. ప్రజల్ని మోసం చేయటానికి ఏదో ఒకటి గాలిలోకి వదిల్తే సరి. సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం సతమతమవుతుంది కదా. రేషన్ సరుకుల పంపిణీ ఉన్నంత కాలం కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొంటుందని చెప్తే అవి చెవి కెక్కవు. ప్రజల్ని రెచ్చగొట్టటానికి కార్పొరేట్లను అడ్డంపెట్టుకొని వున్నది లేనిది కల్పించి వదులుతూ వుంటారు. ప్రైవేటు రంగం లేకుండా ఈ రోజుల్లో అంతా ప్రభుత్వమే నిర్వహించే సామర్ధ్యం ఉందా అంటే మాట్లాడరు. పోనీ వీళ్ళు ఆరాధించే కమ్యూనిస్టు దేశాల్లో ఎందుకు ప్రైవేటు రంగాన్ని ఎందుకు అనుమతించారు అంటే సమాధానం దాటవేస్తారు. పోటీ మార్కెట్ వుంటే రైతులకు మేలు జరుగుతుందంటే ఇదంతా పెట్టుబడుదారుల కుట్ర అంటారు. ఇదేదో ఏమీ తెలియని అమాయకులయితే అర్ధం చేసుకోవచ్చు. అంతా చదువుకున్న మేతావులే చేస్తున్నారు. కారణం సమస్య ఇది కాదు. గత 6 సంవత్సరాల్లో మోడీని ప్రజల్లో ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇదో బంగారు అవకాశంగా భావిస్తున్నారు. ఇది లోపలవున్న అసలు భావన. దీన్ని ఈరూపేనా వ్యక్తపరుస్తున్నారు.

    క్రియాశీలక ప్రజాస్వామ్యం Vs ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం 

    ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. దీనికి ఆద్యం లాటిన్ అమెరికా. శాసన వ్యవస్థని కాలదన్ని పార్టీలు క్రియాశీలక కార్యక్రమాల ద్వారా వ్యవస్థను, ప్రభుత్వాన్ని స్తంభింప చేయటం. ఈ కార్యకలాపాలు అనేక లాటిన్ అమెరికా దేశాల్లో ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. దీనివలన అక్కడ ప్రభుత్వాలు సుస్థిరతను కోల్పోయి ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోవటం చూశాం. దీన్నే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అనుసరించాడు. స్వతంత్రంగా జరిగిన ఎన్నికల ఫలితాన్ని ఒప్పుకోకుండా ఏకంగా తన అనుచరుల్ని అమెరికా కాంగ్రెస్ పైకి దాడికి పురిగొల్పాడు. అదే ధోరణి ఇప్పుడు మనదేశంలోని ప్రతిపక్షాలు అవలంబిస్తున్నాయి. మీరు ఎన్నికల్లో గెలిచి శాసనాలు చేస్తే మేము రోడ్లపైకి వచ్చి ప్రజాజీవితాన్ని స్థంభిస్తాము. దీన్నే క్రియాశీలక ప్రజాస్వామ్యం (Participative Democracy) అంటారు. కమ్యూనిస్టులు ఈ విధానంపై అతిగా ఆధారపడతారు. విశేషమేమంటే ఎక్కువకాలం అధికారంలోవున్న కాంగ్రెస్ ఈ విధానానికి మద్దతివ్వటం. ముందు ముందు ఇటువంటి అనాలోచిత చర్యలవలన కాంగ్రెస్ కి ఇబ్బంది ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ అంత లోతుగా ఆలోచించి వుంటే ఈ పని చేయడు. ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలో వున్న పంజాబ్ లో ఇదే ధోరణి కొనసాగితే అధికారానికి ముప్పువచ్చే అవకాశం వుంది. ఇప్పటికే ఈ విధానాన్ని నమ్మే ఆప్ అక్కడ బలంగా వుందని మరవొద్దు. యోగేంద్ర యాదవ్ ఆలోచనలు ఈ విధానంవైపే వుంటాయి.

    అందుకే ఇప్పుడు ఆయన సంధానంలో రిపబ్లిక్ దినం రోజు డిల్లీని ట్రాక్టర్ ర్యాలీతో దిగ్బంధనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది దుస్సహసిక నిర్ణయం. ఇంతవరకు ఆగష్టు 15, జనవరి 26 తేదీల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టలేదు. ఆ రెండురోజులు మనదేశాన్ని చూసి గర్వపడే విధంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెప లాడించే రోజులుగానే చూస్తూ వచ్చారు. అదీ దేశ రాజధానిలో ఆ రోజుల్లో గందరగోళం జరిగితే ప్రపంచమంతా గగ్గోలుమంటుంది. ఇది వాళ్ళ పన్నాగంలో భాగమే. లేకపోతే ఇంకో రోజు ఈ నిరశన ప్రదర్శన పెట్టుకొని వుండేవారు. ఇంతకుముందు షహీన్ బాగ్ నిరశనల్లో భాగంగా జరిగిన ఢిల్లీ అల్లర్లుకూడా ఇలా ప్రపంచ వ్యాప్త ప్రచారం కోసం ట్రంప్ ఢిల్లీ యాత్రకు అనుసంధానం చేయటం జరిగింది. అది సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడింది. ఇప్పుడుకూడా దీన్ని ప్రపంచవ్యాప్త ప్రచారానికి తయారుచేయటం కోసమే జనవరి 26ని సెలెక్ట్ చేసుకున్నారు. మనరాష్ట్రంలో చాలామంది విద్యావేత్తలు ఇవేమీ ఆలోచించుకోకుండా రైతులకు అన్యాయం జరుగుతుందని ఆ ప్రభావంలో కొట్టుకుపోతున్నారు. దీనివెనకవున్న రాజకీయ కోణాన్ని చూడకుండా పైపైన రైతుల ఫోటోలని చూసి ఆవేశపడితే నష్టపోయేది దేశం.

    ఎందుకు మిగతా రాష్ట్రాల్లో రైతుల్లో ఈ ఆందోళన పాకటంలేదు?

    ఇది మనందరం ఆలోచించుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీలతో ఎక్కువగా ఆధారపడిన రాష్ట్రం పంజాబ్. ఒకనాడు గ్రీన్ రెవల్యూషన్ కి కేంద్రం. కాకపోతే రాను రాను అది సంక్షోభంలో కూరుకుపోయింది. బోరు వ్యవసాయానికి నీళ్ళు కావాలంటే చాలా లోతుకి వెళ్ళాల్సి వస్తుంది. అసలు కాల్వల ఆధునీకరణ సంగతి రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోయాయి. వ్యవసాయ నిపుణులు పంట మార్చమని ఎప్పటినుంచో సలహా ఇస్తున్నారు. ప్రభుత్వాలు రైతుల్ని ప్రోత్సహించిన పాపాన పోలేదు. పక్క రాష్ట్రం ఎకరాకు 7వేలు ప్రోత్సాహకం ఇస్తుంటే ఇక్కడ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వుంది. అయినా యోగ్యతాయోగ్యతలపై ఈ ఆందోళన జరగటంలేదు కాబట్టి వాటిపై ఎక్కువగా మాట్లాడుకొని ప్రయోజనం లేదు. ఒక్క పంజాబ్, కొంతభాగం హర్యానాలోనే ఈ ఆందోళన ఎందుకు జరుగుతుంది?

    ఆంధ్ర, తెలంగాణాలోనూ వరి పంట గణనీయంగా పండిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొడుతున్నా రైతులు ఎందుకు రెచ్చిపోవటం లేదు? మహారాష్ట్రలో ఎందుకు రైతులు చట్టాల్నిసమర్ధిస్తున్నారు? తమిళనాడులో రైతులు డిఎంకె ఎంత రెచ్చగొట్టినా ఎందుకు రెచ్చిపోవటంలేదు? పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఎంత రెచ్చగొట్టినా ఎందుకు రెచ్చిపోవటం లేదు? అన్నింటికన్నా పెద్ద రాష్ట్రంలో రైతు నాయకుడు రాకేశ్ తికాయత్, అఖిలేష్ యాదవ్ ఎంత రెచ్చ గొట్టినా ఎందుకు రెచ్చిపోవటం లేదు? బీహార్ లో మండీ వ్యవస్తలేదని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నా రైతులు ఈ ఆందోళనకు ఎందుకు మద్దతివ్వటంలేదు? మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. పంజాబ్ ఒక్క రాష్ట్రానికే ఈ చట్టాల వలన అన్యాయం జరుగుతుందా? ఈ రాష్ట్రాల్లో జరగటంలేదా? కాంగ్రెస్. సిపిఎం, మిగతా ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రాల్లో ఎంత రెచ్చగొట్టినా ఎందుకు ఫలితం దక్కటంలేదు? మహారాష్ట్ర నుంచి సిపిఎం కొంతమందిని తరలించినా అది రైతాంగాన్ని విస్తృతంగా ఎందుకు కదలించ లేకపోయింది? పంజాబ్ రైతుల్ని రెచ్చగొట్టి పబ్బంగడుపుకుంటున్న ఈ పార్టీలు మిగతా రాష్ట్రాల్లో రైతుల్ని ఎంత శ్రమించినా కదిలించలేకపోవటాన్ని ఎలా చూడాలి? కేవలం ఒకటిన్నర రాష్ట్రాల్లో రైతులు వద్దనుకుంటే చట్టాలు రద్దుచేసుకోవాలా? ఇదే కనక వాస్తవరూపం దాల్చితే రేపు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినట్లే. ఎటువంటి యోగ్యతలేని ఆరోపణలతో  రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తే చట్టాలు నిర్వీర్యమయితే ప్రజాస్వామ్యం మనుగడసాగిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి.