Opposition Dominance Fight: దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి పెరిగింది. బుధవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇదే రోజు తృణమోల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతాబెనర్జీ నేతృత్వంలో విపక్షాల సమావేశం ఢిల్లీలో జరిగింది. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని మాత్రమే ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎవరిని నిలబెట్టాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదరనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విపక్షాల మధ్యే భేదాభిప్రాయాలు పొడచూపితే తిరిగి అది అధికార బీజేపీకే లాభించే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం కంటే.. అభ్యర్థి తాము ప్రతిపాదించిన వ్యక్తి అయిఉంటే మంచిదన్న భావన విపక్షాల్లో కనిపిస్తోంది. దీంతో విపక్షాల ఏకాభిప్రాయం అంత ఈజీ కాదన్న సంకేతం తొలి సమావేశంలోనే బహిర్గతమైంది.
కాంగ్రెస్ సైలెంట్..
సాధారణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల్లో అత్యధిక ఓట్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. కానీ రాష్ట్రపతి ఎన్నికలపై ఆ పార్టీ పెద్దగా ఇన్షేటివ్ చూపడం లేదు. మౌనం వహిస్తోంది. అయితే ఇది వ్యూహాత్మక మౌనమా.. లేక అచేతనమా అనేది అర్థం కావడం లేదు. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన తృణమోల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన వెంటనే అప్రమత్తమైన మమతా బెనర్జీ 23 విపక్షాలకు లేఖలు రాశారు. ఈనెల 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి రావాలని కోరారు. సమావేశానికి ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకున్న మమతాబెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసేందుకు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ను ఎప్పించేందుకు సమావేశం నిర్వహించారు. కానీ శరద్‌పవార్ విముఖత చూపారు.
Also Read: TDP Janasena Alliance- Jagan: జగన్ మైండ్ గేమ్ టీడీపీ, జనసేన పొత్తు కోసమేనట?
17 పార్టీలే హాజరు..
ఢిల్లీలో బుధవారం నిర్వహించిన విపక్షాల సమావేశానికి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. 22 పార్టీలకు మమత లేఖ రాయగా, టీఆర్‌ఎస్, ఆప్, బీజూ జనతాదళ్, అకాళీదళ్, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉన్నాయి. ఈ సమావేశంలో శరద్‌పవార్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయించాలని అన్ని పక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. అయితే విపక్షాల నిర్ణయాన్ని శరద్‌పవార్ సున్నితంగా తిరస్కరించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌యాదవ్‌కు అన్ని పక్షాలు మద్దతు తెలుపగా, ఆయన కాకపోతే ఎవరనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. గాంధీ మనవడు గోపాలకృష్ణగాంధీ పేరును కొంతమంది ప్రతిపాదించగా మరికొంతమంది ఫారూక్ అబ్దులా పేరు ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి సమావేశం కావాలని విపక్షాలు నిర్ణయించారు. సమావేశంలో అభ్యర్థి తాము ప్రతిపాదించిన వ్యక్తి కావాలని కొన్ని పక్షాలు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. మరి ఈనెల 21న జరిగే సమావేశంలో ఏకాభిప్రాయం కుదురుతుందా అంటే దానికీ సమాధానం లేదు.
విపక్షాలకు రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్..
మరోవైపు అధికార బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు కూడగట్టే పనిని మొదలు పెట్టింది. రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాకు బీజేపీ ఈ బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు విపక్షాలకు ఫోన్‌చేసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చరల్లో విపక్ష పార్టీలు అధికార పార్టీవైపు మళ్లితే విపక్షాల కూటమి విచ్ఛిన్నం కాక తప్పదు అప్పుడు ఎవరిని నిలబెట్టినా గెలవడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో గోపాలకృష్ణగాంధీ పోటీకి ముందుకు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఫారూక్ అబ్దుల్లా బీజేపీ వ్యతిరేకి అయినందున పోటీకి ముందుకు వచ్చినా విపఖాల్లోని కొన్ని పార్టీలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించకపోవచ్చు. ఇక అధికార బీజేపీ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెడితే విపక్షంలో చీలిక తప్పదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అభ్యర్థి ఎంపిక రాజకీయాలకు అతీతంగా ఉంటే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాల వ్యూహం బెడిసికొట్టక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read:BYJU’s in AP Govt Schools: జగన్ సర్కార్, బైజూస్.. కొత్త ఒప్పందం కథేంటి?