Janasena Avirbhava Sabha: ఏపీలోని ఇప్పటంలో నిర్వహించిన జనసేన 9వ ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు ఒక్కటే హామీ ఇచ్చారు. అది దారుణాలకు కారణమవుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతానని శపథం చేశారు. ఇందుకోసం అవసరమైతే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చకుండా పొత్తులకు సిద్ధం అని ప్రకటించారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వగానే ఏపీపై దండయాత్ర మొదలు పెట్టి 2024లో జనసేన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై చాలా స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళుతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది. కార్యాచరణ జనసేనాని పవన్ అమలు చేస్తారని.. వ్యూహాలు, ప్రణాళికలు పొత్తు పెట్టుకున్న బీజేపీ అందిస్తుందని పవన్ చెప్పకనే చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ ఇవ్వగానే దండయాత్ర మొదలుపెడుతానని.. బీజేపీ ప్లాన్ ప్రకారం ఏపీలో ముందుకెళ్లి రాజ్యాధికారం సాధిస్తామని తెలిపారు.
ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైతే పొత్తులకు సిద్ధం అని ప్రకటించారు. దీన్ని బట్టి టీడీపీ కోరితే ఆ పార్టీతో పొత్తుకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్ లు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికారు. భీమ్లానాయక్ ను తొక్కేసిన వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా.. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. భీమ్లానాయక్ చూడాలంటూ టీడీపీ నేతలకు బహిరంగంగానే చెప్పారు. పవన్ ను జగన్ తొక్కేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ లు ఆరోపించారు.
దీన్ని బట్టి టీడీపీ కూడా జనసేనానితో పొత్తుకు ఇప్పటికే ఆసక్తి చూపింది. తాజాగా పవన్ సైతం వైసీపీని ఓడించడానికి.. ఆ పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని సంచలన ప్రకటన చేశారు.అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానన్నారు.
దీంతో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ బలం చాలదు. జనసేన-బీజేపీ కూటమికి అంత శక్తి కూడదీసుకోదు. దీంతో పవన్ కళ్యాణ్ ముందుండి ప్రతిపక్షాల సమాఖ్య కూటమికి పురుడు పోయడం ఖాయంగా కనిపిస్తోంది. అనంతరం ఈ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ఎన్నుకోబోతున్నారని సమాచారం.
ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు చాలా సార్లు సీఎంగా చేశారు. ఇప్పుడాయనకు 70 ఏళ్లు దాటాయి. వృద్ధాప్యం బాబుకు భారం అవుతోంది. ఇక చంద్రబాబు వారసుడు లోకేష్ కు నాయకత్వం లక్షణాలు లేవు. ఇక బీజేపీ సోము వీర్రాజు ఇప్పటికే పవన్ కళ్యాణ్ యే మా ఉమ్మడి సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. దీంతో ఈ ప్రతిపక్షాల కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే.. ఈ కూటమి పురుడు పోసుకుంటే.. వైసీపీ ఓటు చీలకుండా ఆ పార్టీకి ఓటమి ఖాయం. 2024లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయం. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.