Oparation Bhrmma: మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ విపత్తుకు అంతర్జాతీయ సమాజం నుంచి సాయం వెల్లువెత్తుతున్న వేళ, తొలి స్పందనగా భారత్ ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’(Oparation Bhrmma) పేరిట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన భారత్, బాధితులకు తక్షణ ఉపశమనం కల్గించేందుకు శరవేగంగా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున 3 గంటలకే సైనిక విమానాల ద్వారా మయన్మార్కు పంపింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ లైట్లు, జెనరేటర్లు, అత్యవసర ఔషధాలు వంటివి ఈ సామగ్రిలో ఉన్నాయి. ఉదయం 8 గంటలకల్లా ఈ సామగ్రి స్థానిక బాధిత ప్రాంతాలకు చేరింది. అంతేకాదు, 118 మంది వైద్య, సాంకేతిక సిబ్బందితో కూడిన ఫీల్డ్ ఆస్పత్రి(Field Hospital)ని శనివారం రాత్రికల్లా వాయుమార్గంలో తరలించారు. ఈ బృందం మాండలే ప్రాంతంలో గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తోంది. మరో రెండు వాయుసేన విమానాల్లో అదనపు సామగ్రి, అలాగే ఐఎన్‌ఎస్ సాత్పురా, ఐఎన్‌ఎస్ సావిత్రి నౌకల్లో 40 టన్నుల సామగ్రిని యాంగూన్కు పంపుతున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
సహాయక చర్యలకు..
కమాండెంట్ పి.కె. తివారీ నేతృత్వంలో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సభ్యులు, రెస్క్యూ డాగ్స్(Resque dogs), ఆరు అంబులెన్సులతో శనివారం సాయంత్రానికి బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మొదలుపెట్టారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి కూడా సాయం అందుతోంది. భారత్–మయన్మార్ మధ్య 1,643 కి.మీ. సరిహద్దు ఉండటం వల్ల ఈ సహాయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రహ్మ పేరుతో…
ఈ సహాయానికి ‘బ్రహ్మ’(Bhramma) అనే పేరు వెనుక ఉద్దేశం గురించి విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ వివరిస్తూ, ‘విధ్వంసం జరిగిన మయన్మార్లో మౌలిక సదుపాయాలను త్వరగా పునరుద్ధరించాలని భారత్ కోరుకుంటోంది. అందుకే ఈ ఆపరేషన్కు బ్రహ్మ అని నామకరణం చేశాం‘ అన్నారు. గత ఏడాది యాగీ తుపాను సమయంలోనూ భారత్ ఇలాంటి సాయమే అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ, మయన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్తో ఫోన్లో మాట్లాడి, అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.