ఏపీలో ఇరవై నెలల్లో ఆ పార్టీ ఏమాత్రం పెరిగింది అన్నది అధినాయకత్వానికే తెలియదు. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో చంద్రబాబుకే తెలియదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటూ మెజారిటీ ఓట్లూ సీట్లూ అధికార పార్టీకే వెళ్తాయి. దాంతో వచ్చే ఎన్నికల వరకూ టీడీపీ బండిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడమే చంద్రబాబు పని. ఆయనకు సహకరించి పార్టీ కట్టు తప్పకుండా చూడడం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇతర పెద్దల పని.
Also Read: గంటా.. జేడీ స్పెషల్ భేటీ : అందుకేనట..?
అయితే.. తరచూ అరెస్టులతో అచ్చెన్నాయుడు ఏపీలో హైలెట్ అవుతున్నారు. జగన్ కూడా చంద్రబాబుని పక్కన పెట్టి అచ్చెన్న లాంటి వారినే టార్గెట్ చేస్తోంది. దాంతో టీడీపీలో ఫోకస్ మొత్తం అచ్చెన్న వైపే ఉంటోంది. ఈ పరిణామాలతో అచ్చెన్నాయుడు చాలానే ఊహిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తాను హోం మంత్రి అవుతానంటూ ఆయన బోల్డ్‌గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది సడెన్‌గా ఆవేశంలో వచ్చింది అనుకుంటే పొరపాటే. మనసులో ఎప్పటి నుంచో ఉంటేనే తప్ప ఇలా బయటకు రాదు అని పార్టీలో తమ్ముళ్లే అంటున్నారు. ఒక విధంగా ఇది అధినేత చంద్రబాబుకే షాక్ ఇచ్చే స్టేట్ మెంట్ అని కూడా అంటున్నారు.
ఇంకా అధికారంలో ఉన్న పార్టీకి మూడున్నరేళ్ల కాలం ఉంది. ఆ తరువాతే ఎన్నికలు. అపుడు కూడా గ్యారంటీగా గెలుస్తామన్నదీ లేదు. కానీ.. అప్పుడే మంత్రి పదవుల పందేరం మొదలైంది టీడీపీలో. ఇప్పటికే టీడీపీలో అచ్చెన్నకు చంద్రబాబు ఇస్తున్న వెయిట్‌తో మిగిలిన సీనియర్ నేతలు తెగ గుస్సా అవుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తామేం తక్కువ అని కూడా వారు ఆఫ్ ది రికార్డుగా మండిపడుతున్నారు. ఇపుడు టీడీపీలో చంద్రబాబు ప్రమేయం లేకుండా ఫలానా మంత్రి పదవి అంటూ తానే అచ్చెన్నాయుడు ఎంచుకోవడం అంటే అది పూర్తిగా పార్టీ విధానాలకే వ్యతిరేకం అంటున్నారు. ఎవరిని ఏ పదవి ఇవ్వాలో చంద్రబాబుకు బాగా తెలుసు అన్న మాట కూడా తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది.
Also Read: టీఆర్‌ఎస్ మరోసారి ఆ సీటును వదులుకున్నట్లేనా..?
అయితే.. అచ్చెన్న వ్యాఖ్యల మీద మరోవైపు పార్టీలోనే కాదు బయట కూడా వేరే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మునుపటి మాదిరిగా చంద్రబాబుకు పార్టీలో పట్టు లేదని దానికి ఉదాహరణే అచ్చెన్న లాంటి వారు మంత్రి పదవులు స్వయంగా ఎంచుకోవడం అని ఎత్తి చూపుతున్నారు. ఇదే రకమైన ధోరణి అచ్చెన్నలోనే కాదు, చాలా మంది పార్టీ నాయకులకు ఉందిట. ఇపుడు పార్టీలో గొంతు విప్పుతున్న చాలా మంది టీడీపీ మీడియా బేబీలు పవర్‌లోకి వస్తే తామే మంత్రులమని అప్పుడే గట్టిగా చెప్పుకుంటున్నారుట. జనాలలో కనిపించని వారు, టీడీపీ అనుకూల మీడియా ద్వారా పెద్ద నోరు చేసే వారి వల్ల టీడీపీ ఎలా అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ అపుడే మంత్రి పదవుల పంపిణీ మాత్రం టీడీపీలో జోరుగా సాగుతోందని సెటైర్లు పడుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్