AP Online Ticket Issue: చిత్ర పరిశ్రమపై ఏపీ సర్కారు కత్తి కట్టింది. కొన్ని మినహాయింపులు ఇస్తామని సాక్షాత్ సీఎం జగన్ ప్రకటించిన తరువాత కూడా సినిమా వాళ్లకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై ఎగ్జిబిటర్లను దారికి తెచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. లైసెన్స్ రద్దు అనే అస్త్రంతో భయపెడుతోంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ టికెటింగ్‌కు సంబంధించి ప్రభుత్వం ఈ నెల రెండో తేదీన జీవో 69ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి మండలి రూపొందించిన అవగాహన ఒప్పందా(ఎంవోయూ)లపై సంతకాలు చేయాలని థియేటర్ల నిర్వాహకులు/యజమానులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే ఎంవోయూలోని కొన్ని అంశాలపై స్పష్టత లేదని వారు అంటున్నారు. దీంతో ఉభయపక్షాల నడుమ వివాదం రాజుకుంటోంది. నగదుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా.. ఆ సంగతి సరే.. ముందు ఎంవోయూలపై సంతకాలు చేయాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు.దీంతో ఎగ్జిబిటర్లకు, థియేటర్ యాజమన్యాలకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.
అధికారుల దూకుడు..
అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయో తెలియదు కానీ.. అధికారులు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేటలోని ఐదు ఏసీ థియేటర్లలో మ్యాట్నీ ఆటలను రద్దు చేశారు. ఎంవోయూలపై సంతకాల కోసమే అధికారులు ఈ చర్యలకు దిగారని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు వారు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా నగదు విషయంలోనే వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. తెలుగు ఫిలిం చాంబర్ లేఖ ఇవ్వడంతోనే తాము ఆన్‌లైన్ టికెటింగ్‌కు ముందడుగు వేశామని చలనచిత్ర అభివృద్ధి మండలి అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి లేఖలు ఇవ్వలేదని ఫిలిం చాంబర్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. టికెట్లు విక్రయించడం ద్వారా వచ్చిన నగదు తమ వద్దే ఉంటుందని మండలి తమకు రాసిన లేఖల్లో పేర్కొన్నట్లు చాంబర్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: AP Govt Free Electricity Scheme: ఏపీలో ఉచిత విద్యుత్ కు తూట్లు.. రైతులతో బలవంతపు సంతకాలు అందుకేనా?
ప్రైవేటు యాప్ లు మాదిరిగా..
ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది.కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు.
మెతక వైఖరితోనే..
ఆన్‌లైన్ టికెట్లపై అప్పట్లో సినీ ప్రముఖుల మెతక వైఖరే ప్రతిష్టంభనకు కారణమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాడు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి వెళ్లి అభ్యర్థించిన సీఎం జగన్ కనికరించయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. చిత్రపరిశ్రమకు చెందిన ప్రతినిధులు కొద్దినెలల క్రితం పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ సమయంలో తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఆన్‌లైన్ టికెటింగ్‌ను సినిమాటోగ్రఫీ చట్టంలో చేర్చాలని సూచించినట్లు తెలిసింది. ఆయన మాటతోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. దీనిపై అప్పుడు ఎగ్జిబిటర్లు మౌనం దాల్చడంతోనే సర్కారు చకాచకా అడుగులు ముందుకు వేసింది. గడచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో కొంతమంది ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఫిలిం చాంబర్‌లో ఎలాంటి నిర్ణయం జరగలేదు. చిలకలూరిపేటలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకున్న ఎగ్జిబిటర్లు త్వరలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఫిలిం చాంబర్ వర్గాలు తెలిపాయి.
Also Read:Pavan Kalyan: జగన్, బాబులను బీట్ చేయాలంటే పవన్ ఏం చేయాలి..?