One Nation One Election: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా సాగుతోంది. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో ప్రతిపాదన పెట్టింది. అయితే పార్లమెంట్ లో చర్చలు జరగుతున్న వేళ ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో ప్రాధాన్యతన సంతరించుకుంది. దీంతో 2024 ఎన్నికల్లో జమిలి విధానాన్ని అవలంభిస్తారా..? అనే చర్చ సాగుతోంది.

ఇక ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే అందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే జమిలి ఎన్నికలపై పార్లమెంట్ సమావేశాల్లో విస్తృత చర్చ జరగాలన్నారు. అయితే జమిలి ఎన్నికలను ఎలా నిర్వహించాలి..? అనేది వ్యూహం ప్రకారం వెళ్లాలన్నారు.
అంటే సగం రాష్ట్రాల ఎన్నికలు ఒకసారి.. మరోసగం రాష్ట్రాలు ఇంకోసారి నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అయితే దీనిపై పార్లమెంట్ లోనే నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నా.. ఎలక్షన్ కమిషన్ అందుకు సిద్ధంగా ఉందన్నారు. ఐదేళ్లకోసారి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో మాకు ఎలాంటి కష్టం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తాము ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ర్యాలీలు, పాదయాత్రలు, నిషేధించామన్నారు. ఇందుకు డిసెంబర్లో ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి కారణమన్నారు. కొన్ని రాష్ట్రాలో టీకా పంపిణీ ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల భౌతిక ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇంటింటి ప్రచారానికి అనుమతినిచ్చాం.. అయితే ప్రచారంలో పాల్గొనేవారి సంఖ్యను కుదించామని ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.

అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహిస్తే అదనపు ఖర్చు అవుతుందని, ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందని పార్లమెంట్లో ఎప్పటినుంచో చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా సిపారసులు చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్లో తెలిపారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జమిలి ఎన్నికలపై తన వైఖరి స్పష్టం చేశారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనే పదాన్ని కేవలం మాటల వరకు పరిమితం చేయమని దానిని ప్రాక్టికల్ గా అమలు చేస్తామని అన్నారు.
ఇక తాజాగా వెలువడుతున్న ఐదురాష్ట్రాల ఫలితాల కారణంగానే ఎలక్షన్ ఈ విధంగా స్పందించని తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని కఠోర పరిస్థితుల్లోనూ ఎలక్షన్ సమర్థవంతంగా నిర్వహించామని, అలాంటప్పుడు జమిలిపై కూడా ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఆ విషయం మొత్తం పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో బీజేపీకి ఇక పార్లమెంట్లో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా..? అనేది తేలాల్సి ఉంది.