Hindi Language Controversy: భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహానికి తెరతీసిందా? ఒకే దేశం..ఒకే పార్టీ విధానానికి ప్రయత్నిస్తోందా? ప్రజలను మత, కుల, వర్గాలుగా విడగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి యత్నిస్తోందా? రాజకీయ పునరేకీకరణ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఉవ్విళ్లూరుతోందా? ఇందుకు హిందీ భాషను వినియోగించుకుంటుందా? ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయం హిందీ కావాలని ఆకాంక్షించడం వెనుక అసలు కారణం ఇదేనా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల వరుసగా బీజేపీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రస్తానాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రజలను చిల్చడం ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు భాషపై ప్రయోగం చేస్తుండడం వ్యూహంలో భాగమేనని అనుమానిస్తున్నారు. తొలుత ఎన్నార్సీలు, తరువాత హిజాబ్ లు, హలాల్ పేరుతో కొంతవరకూ రాజకీయ మైలేజ్ తెచ్చుకున్నారు. తాజాగా హిందీ భాషను జాతీయ భాషగా చేసి లబ్థి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అధికార భాషను జాతీయ భాషగా చేయాలన్న ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ కు దీటుగా హిందీ భాషను ప్రమోట్ చేయాలన్న వ్యాఖ్యలు వెనుక విశాల ప్రయోజనాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: KGF 2 Collections: ‘కేజీఎఫ్2’ దండయాత్ర.. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ అయ్యిందా? తొలిరోజు ఎంత వసూలంటే?
ఒక్కో భాషది..ఒక్కో విశిష్టత
భిన్నత్వంలో ఏకత్వం.. భారతదేశం గొప్పతనం. దేశంలో వందలాది భాషలు మాట్లాడే వారుంటారు. ఒకే భాషను వివిధ ధోరణుల్లో మాట్లాడే వారు ఇక్కడ అధికం. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఒక్కో ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు మారుతోంది. ఒక్కొక్కరూ ఒక్కో శ్లాంగులో మాట్లాడతారు. ఏ రాష్ట్ర ప్రజలకు వారి భాష పై వల్లమానిన అభిమానం. దక్షిణాదిలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో హిందీని బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. వాస్తవానికి హిందీని బలవంతంగా రుద్దడంపై దశాబ్దాల కిందట నుంచే దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలున్నాయి. హిందీ గురించి అమిత్ షా కామెంట్ చేయగానే దక్షిణాదికి చెందిన నాయకులు తీవ్రంగా స్పందించారు.
ఇది భారతదేశం భిన్నత్వంపై దాడిగా అభివర్ణించారు. దేశ ప్రజలు ఏం తినాలి.. ఏం మాట్లాడాలి అనేది వారికే వదిలేయాలని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, వారి ఉపాధి, ఉద్యోగాలను గండి కొడతాయని సర్వత్రా ఆందోళన నెలకొంది. దేశంలో ఉన్న వందలాది భాషలకు హిందీ అధికార భాష వరకూ ఒకే కానీ.. జాతీయ భాష కాకూడదని అన్నివర్గాల ప్రజలు భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం జాతీయ భాషగా చూడాలని పరితపిస్తోంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలే అధికార భాషలుగా ఉపయోగిస్తున్నారు. హిందీ భాష కన్నా ప్రాచీనమైన భాషలు భారత్‌లో ఉన్నాయి. సంస్కృతం, ఉర్దూ, ఇతర భాషల మిశ్రమం హిందీ. కానీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటివి ప్రత్యేకమైనవి. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో ఆందోళనలు పెల్లుబికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు.
చట్టాన్ని సవరించాలని యత్నం
తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ గుర్తించారు. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాల్లో ఇంగ్లిష్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధికార భాషల చట్టాన్ని సవరించారు. ఇప్పుడు దాన్ని తాజాగా సవరించాలన్న ప్రయత్నంలో బీజేపీ నేతలు ఉన్నారు. వాస్తవానికి ఏ భాషను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. పాకిస్తాన్ రెండు ముక్కలు కావడానికి, అందులో ఒకటి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించడానికి ప్రధాన కారణం భాషే. ముస్లింలు అయినా బంగ్లాదేశీయుల మాతృభాష బెంగాలీ కావడం దేశం విడిపోయేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. భాష అంటే ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. అందుకే బంగ్లాదేశీయులు పోరాడి స్వదేశాన్ని సాధించుకున్నారు. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడేవారు 60 శాతం ఉన్నారన్న విషయం గుర్తించాలి. పరిపూర్ణ హిందీ మాట్లాడే వారు కొద్దిమందే. దేశంలో హిందీ, దాని దగ్గరగా ఉండే భాష మాట్లాడేవారు 40 శాతం మంది ఉన్నారు. అటువంటి హిందీని తప్పనిసరి చేయడం, జాతీయ భాషగా గుర్తించాలని పరితపించడం వెనుక రాజకీయ లబ్ధి కారణంగా తెలుస్తోంది.
కొత్తగా వచ్చిన ప్రమాదమేమిటి?
భారత దేశానికి 75 ఏళ్లకుపైగా అధికార భాష అంటూ ఏదీ లేదు. అయినా దేశానికి ప్రమాదమేమీ రాలేదు. కానీ ఏవేవో సాకులు చూపి ఇప్పుడు హిందీ భాషను తెరపైకి తేవడం రాజకీయమే అవుతోంది. ఒక వేళ హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా, ఉద్యోగావకాశాలకు షరతుగా విధించినా దక్షిణాదిన ఆందోళనలు తీవ్రతరమయ్యే అవకాశముంది. అలాంటి చర్యలు హిందీ భాషపై తీవ్ర విముఖతను పెంచుతాయి. భాషను నేర్చుకోమని ప్రోత్సహించడం వేరు .. బలవంతం చేయడం వేరు !. ఏ భాష వ్యక్తులయినా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడం పెద్ద సమస్య కాదు. పైగా ఇప్పుడు చదువుకుంటున్న వారంతా రెండు, మూడుభాషల్లో ఖచ్చితంగా ప్రావీణ్యం సంపాదించే వారే ఉంటున్నారు.
బతుకుదెరువు కోసం తప్పదనుకుంటున్నారు. ఇలాంటి చైతన్యం వస్తే తప్పు లేదు. కానీ బలవంతంగా హిందీ నేర్చుకోవాలన్న ఒత్తిడి చేస్తే పరిస్థితి వేరుగా మారుతుంది. రాజకీయ అంశమవుతుంది. బహుశా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా .. ఈ అంశం రాజకీయం అయితే చాలనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇక్కడ హిందీ గురించి బీజేపీ నేతలు ఒక్కటిమట్లాడితే.. దక్షిణాది నేతలు పది మాట్లాడతారు. ఎవరికైనా రాజకీయమే కావాలి. దక్షిణాది ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బకొడుతున్నారని ఇక్కడి నేతలు ప్రచారం చేస్తే బీజేపీకి ఇబ్బందే. అయితే అయితే అదే సమయంలో .. వారు ఉత్తరాదిలో ఈ సెంటిమెంట్ పండించుకోవచ్చు. ఎవరి రాజకీయం వారిది. కానీ ప్రజల్ని విడదీస్తేనే మొదటికే మోసం వస్తుంది. నూతన విద్యావిధానంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా విధానాన్ని నిర్బంధంగా అమలు చేయాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫారసు చేసింది. హిందీ నేర్చుకోని రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీ భాషను నిర్బంధంగా అమలు చేయబోమని స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే అప్పటి ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాలకు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పుడు కేంద్రం.. నిర్బంధం చేయడానికి ప్రయత్నిస్తోంది.. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క పార్టీ కూడా.. ఈ వివాదంపై తన విధానమేంటో చెప్పలేదు. హిందీ ని కచ్చితంగా నేర్చుకోవాల్సిందేనని… బలవంతం చేస్తే.. అది.. అంతిమంగా తెలుగు భాష అస్థిత్వానికే ముప్పు తెచ్చి పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాలను అనుసరిస్తారో? లేదా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద సాగిలాలు పడతారో వేచిచూడాలి.
Also Read:AP Ration Rice: రేషన్ బియ్యం వద్దా..అయితే నగదు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్