Pawan Kalyan: జనసేన… జనాల సమస్యలను గుర్తెరిగిన సేన. జనాల బాధలను తెలుసుకునే సేన. బాధితులను అక్కున చేర్చుకునే సేన. వారికి స్వాంతన చేకూర్చే సేన. బహుశా ఏ రాజకీయ పార్టీ తన ప్రయాణంలో అధికారమే పరమావధిగా పనిచేస్తుందే తప్ప.. సేవలకు ఇష్టపడదు. సొంత డబ్బులు ఖర్చు చేసేందుకు ముందుకు రాదు. కానీ ఫస్ట్ టైమ్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తన సొంత డబ్బులను ప్రజలకు పంచుతున్నారు పవన్ కళ్యాణ్. వితరణ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. సమాజంలో దగాకు గురవుతున్న వారికి అండగా నిలుస్తున్నారు. శ్రీకాకుళంలో రెండేళ్ల కిందట హత్యకు గురైన ఓ మత్స్యకార యువకుడి కుటుంబ దీన స్థితిని గమనించి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. రెండేళ్లుగా కేసు విచారణలో జరుగుతున్న ఉద్దేశపూర్వక జాప్యంపై బాధిత కుటుంబం పడుతున్న బాధను తెలుసుకొని చలించి పోయారు. వారికి స్వాంతన చేకూర్చేందుకు సాయం ప్రకటించడమే కాకుండా… పూర్తిస్థాయి న్యాయం జరిగేలా పోరాడుతానని పవన్ హామీ ఇచ్చారు.

వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు ఒక మత్స్యకార గ్రామం. సుమారు 15 వేల జనాభా ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన మువ్వల నగేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి రెండేళ్ల కిందట అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎచ్చెర్లలో తాను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రణస్థలం మండలంలో విద్యార్థి మృతదేహం కనిపించింది. అయితే కాలేజీ యాజమాన్యం ఆలస్యంగా తల్లిదండ్రులకు సమాచారం అందించింది. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లు చూస్తే హత్యగా కనిపిస్తోంది. దీనిపై న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, గ్రామస్థులు కాలేజీ వద్ద ఆందోళనకుదిగారు. సొంత నియోజకవర్గానికి చెందిన విద్యార్థి కావడంతో పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు స్పందించారు. బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అది అమలుకాకుంటే మీతో కలిసి ఆందోళన చేస్తానని కూడా చెప్పారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతి లేదు. మంత్రిని కలిస్తే కేసును సెటిల్ చేసుకోవాలని చెబుతున్నారు.

జనసేన కీలక నాయకుడు నాదేండ్ల మనోహర్ శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఆ యువకుడి తల్లి సుందరమ్మ మనోహర్ ను కలుసుకున్నారు.తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని బోరున విలపించింది. ఆమె స్థితిని చూసి చలించిపోయిన మనోహర్ ఓదార్చారు. ఇప్పటికే పవన్ మీ పరిస్థితి తెలుసుకున్నారని.. మీకు అండగా ఉంటామని చెప్పారని.. జనసేన తరుపున రూ.లక్ష సాయం ప్రకటించారని చెప్పడంతో ఆ వృద్ధురాలు కళ్లు చెమర్చాయి. కన్నీరు ఆగలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఏకరువు పెట్టారు. జనసేన అండగా ఉంటుందని.. మీకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే బాధ్యత తీసుకుంటుందని మనోహర్ ఆమెకు హామీ ఇచ్చారు. జనవరి 12న పవన్ రణస్థలం రానున్నారని.. ఆ రోజు కల్పిస్తానని హామీ ఇవ్వడంతో సంతృప్తిగా అక్కడ నుంచి వెళ్లింది.