Omar Abdullah: పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాడు.. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాడు.. సీన్ కట్ చేస్తే జమ్ము కాశ్మీర్ సీఎం అయ్యాడు.. ఓమర్ అబ్దుల్లా సక్సెస్ స్టోరీ ఇదీ

ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాడు. ఇక రాజకీయాలకు స్వస్తి అని ప్రకటించాడు. కానీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతోనే తన మాటను వెనక్కి తీసుకున్నాడు. రెండు స్థానాల్లో పోటీలో నిలిచాడు. రెండుచోట్లా విజయం సాధించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 12:22 pm

Omar Abdullah

Follow us on

Omar Abdullah: జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి త్వరలో ముఖ్యమంత్రిగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. మ్యాజిక్ ఫిగర్ కు మించి సీట్లు సాధించి.. గవర్నమెంట్ ను ఏర్పాటు చేయబోతున్నాయి. ముఖ్యమంత్రిగా ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓమర్ అబ్దుల్లా కుటుంబానికి జమ్ము కాశ్మీర్లో అత్యంత రాజకీయ ప్రాబల్యం ఉంది. ఓమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఓమర్ అబ్దుల్లా 28 సంవత్సరాల వయసులోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై.. అత్యంత చిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.. 38 సంవత్సరాల వయసులోనే జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఓమర్ అబ్దుల్లా పనిచేశాడు. 2008లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.. ఓమర్ అబ్దుల్లా 1970 లో పుట్టాడు. తండ్రి పేరు ఫరూక్ అబ్దుల్లా, తల్లి పేరు మోలీ. శ్రీనగర్ ప్రాంతంలోని సోన్వార్ బాగ్ ప్రాంతంలో ఉన్న బర్న్ హాల్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. సనావర్లోని లారెన్స్ స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత సిడిన్ హం కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బీకాం పూర్తి చేశాడు. రాజకీయాలకు రాకముందు ఐటిసి లిమిటెడ్, ది ఒబేరాయ్ హోటల్ గ్రూపులో ఓమర్ అబ్దుల్లా పనిచేశాడు. అయితే ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం.. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక రావడం జరిగిపోయాయి. ఓమర్ ఢిల్లీకి చెందిన విశ్రాంత ఆర్మీ అధికారి రామ్ నాథ్ కుమార్తె పాయల్ ను వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాలకు వారిద్దరు విడిపోయారు.

అనేక విషయాలపై పట్టు

ఓమర్ కు అనేక విషయాలపై పట్టు ఉంది. ఆయన మంచి వక్త. 2008లో పార్లమెంటు లో జరిగిన విశ్వాస తీర్మానంలో ఓమర్ చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. అప్పట్లో ఇంతలా సోషల్ మీడియా లేదు కాబట్టి… పత్రికలు, న్యూస్ ఛానల్స్ లో ఓమర్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది..

రాజకీయాల్లోకి ఇలా..

ఓమర్ రాజకీయాల్లోకి రావడం ఆయన తల్లికి ఇష్టం లేదు. 1998లో పార్లమెంటుకు ఎన్నికైన ఓమర్.. నాటి వాజ్ పేయి ప్రభుత్వంలో రవాణా, పర్యటక కమిటీ, పర్యటక మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2001లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే జమ్ము కాశ్మీర్లో పార్టీ విస్తరణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. తండ్రి అనంతరం పార్టీకి అధ్యక్షుడిగా మారారు. సెప్టెంబర్ – అక్టోబర్ 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓమర్ అబ్దుల్లా తన గందర్ బాల్ స్థానంలో ఓడిపోయారు. 2008 కాశ్మీర్ ఎన్నికల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధికంగా స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓమర్ అబ్దుల్లా కాశ్మీర్ రాష్ట్రానికి 11 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..

అనేక మార్పులు

2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న కేంద్ర పాలిత హోదాను పక్కనపెట్టి రాష్ట్ర హోదాను కేంద్రం కల్పించింది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరపలేదు. 2024లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య హోరాహోరీగా ఎన్నికల జరిగాయి. అయినప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అందువల్ల ఇప్పుడు ఓమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ఈ ప్రాంతంలో అధికారులు తెరపైకి సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. 2020 మేలో ఆమోదం పొందిన నూతన గృహ నిబంధనల చట్టం ప్రకారం కొన్ని షరతుల ఆధారంగా కాశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా శాశ్వతంగా నివాస హక్కులను పొందవచ్చు. కాశ్మీర్ రాష్ట్రంలో 15 ఏళ్లకు పైబడి నివాసం ఉన్న వారు ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. భూములు కొనుగోలు చేయొచ్చు.

ఆర్టికల్ 370 ని స్వాగతించినప్పటికీ..

హిందువులు అధికంగా ఉండే జమ్ములోని ప్రజలు.. వేరే ప్రాంతాల్లో స్థిరపడిన కాశ్మీర్ హిందువులు కూడా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించారు. అయితే కొత్త నివాస నిబంధనలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పోరాడుతామని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఎన్నికల్లో ప్రచారం చేశారు. పేదలకు ఉచితంగా 12 గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి హామీలతో ఓమర్ ప్రజల ముందుకు వెళ్లారు. ఇది బాగా వర్క్ అవుట్ అయింది. కాశ్మీర్ లోయలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండడం వల్ల.. ఓట్లు మొత్తం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి పడ్డాయి. అయితే కొన్ని నెలల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన ఓమర్.. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడం విశేషం.