Odisha CM Naveen Patnaik: “అధికారం అనేది ఒక ఆయుధం లాంటిది. దాని ద్వారా మంచి పనులు చేస్తే ప్రజల్లో మిగిలిపోతాం. ఒకవేళ దానిని సొంతానికి వాడుకుంటే కాలగర్భంలో కలిసిపోతాం. నాది అనేది ఏదీ లేదు. ఉండాలి అని కూడా అనుకోవడం లేదు. జగమంత కుటుంబం నాది. ఏకాకి జీవితం కూడా నాదే. నన్ను నమ్మి ఈ ప్రజలు మొత్తం ఓట్లు వేసినప్పుడు వారికోసం నేను ఏదైనా చేయాలి. ఇందులో నా జీవితం తృణప్రాయంగా కరిగిపోయినా పర్వాలేదు.” ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలా ఉంటుంది? ధన స్వామ్యం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న వేళల్లో.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ ముఖ్యమంత్రి మళ్ళీ గెలుస్తాడా? మిగతా రాష్ట్రాలు ఏమో గానీ ఒడిశా రాష్ట్రంలో మాత్రం కచ్చితంగా నవీన్ పట్నాయక్ గెలుస్తాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేని వ్యక్తి కాబట్టి.. అక్కడి జనం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తారు. అక్కున చేర్చుకుంటారు.
ఒడిస్సానే ఆయనకు ప్రథమ ప్రాధాన్యం
సాధారణంగా మన తల్లి లేదా తండ్రి కాల ధర్మం చేస్తే వారి గుర్తుగా సమాధి నిర్మిస్తాం. మనం బతికి ఉన్నన్నాళ్ళు వారి వర్ధంతి నాడు లేదా జయంతి నాడో పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తాం. ఇంకా కొందరు రాజకీయ నాయకులు అయితే తమ తండ్రులు చనిపోతే వారి విగ్రహాలను ఊరూరా పెట్టిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జన సమ్మర్థం భారీగా ఉండే ప్రదేశాల్లో కూడా విగ్రహాలు పెట్టి ఒకరకంగా పూజలు చేయాలని పరోక్షంగా మనకు సంకేతాలు ఇస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఏ విధంగా ఆవిష్కరించాడో మనం చూసాం కదా. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రతి పథకానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం కూడా చూస్తున్నాం. ఇలాంటి బ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలో నవీన్ పట్నాయక్ లాంటి ముఖ్యమంత్రి పూరి మహాప్రస్థానం ఆధునీకరణ పనుల్లో తన తండ్రి బిజుబాబు సమాధిని కూడా తొలగించాడు అంటే మామూలు విషయం కాదు. ఇది ఏ మీడియాలో కూడా రాలేదు. మీడియాలో వచ్చేందుకు నవీన్ పట్నాయక్ ఒప్పుకోలేదు.
ఎలా తెలిసిందంటే
మనదేశంలో పేద రాష్ట్రాల జాబితాలో ఒడిశా కూడా ఉంటుంది. ఆ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు నవీన్ పట్నాయక్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. నవీన్ పట్నాయక్ తెలుసు కదా.. పెళ్లి చేసుకోలేదు. అతనికంటూ కుటుంబం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వారు ఏ వ్యవస్థలో వేలు పెట్టరు. కాబట్టి తనను ఎన్నుకున్న ప్రజలే ఆయనకు కుటుంబ సభ్యులు. ఆ దిశగానే ఆయన పాలన ఉంటుంది. గతంలో మనం చెప్పుకున్నాం కదా! ఒక అనాధను అక్కున చేర్చుకొని అతడిని ఉన్నత చదువులు చదివించి ఏకంగా పారిశ్రామికవేత్తను చేశాడని. ఒడిశాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆ మధ్య ఒక సమ్మిట్ నిర్వహించినప్పుడు ఆ యువ పారిశ్రామికవేత్త తాను ఏ విధంగా ఇంత ఎత్తుకు ఎదిగింది చెబుతుంటే నవీన్ పట్నాయక్ కన్నీరు కార్చాడు. ఆ యువకుడిని ఆ లింగంనం చేసుకున్నాడు. అప్పట్లో భారీగానే ఒడిశా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. పేద రాష్ట్రమైన తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నవీన్ పట్నాయక్ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రతిపక్షాలపై విమర్శలు చేయరు. తన పని తాను కుంటూ వెళ్లిపోతారు.
ఒడిశా అభివృద్ధి కోసం పరితపిస్తుంటారు
ఇక ఇటీవల దుబాయ్ లో ఒడిశా దివస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్య అధికారి కార్తికేయ పాండియన్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఒడిస్సా రాష్ట్రంతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగా పరితపిస్తుంటారో ఆయన వివరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి మహాప్రస్థానం అభివృద్ధి కోసం నవీన్ పట్నాయక్ ఏకంగా తన తండ్రి సమాధి తొలగించేందుకు కూడా వెనుకాడలేదని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులకు ముఖ్య మంత్రి ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం చేశారని ఆయన వివరించారు. అయితే నవీన్ పట్నాయక్ చేసిన త్యాగం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనదేశంలో నాయకుల సమాధుల కోసం ఎకరాల భూమి కేటాయించిన ఉదంతాలు మనం చూసాం. కానీ మహాప్రస్థానం అభివృద్ధి కోసం తన తండ్రి సమాధిని తొలగించిన ముఖ్యమంత్రిని మాత్రం నవీన్ పట్నాయక్ లో మాత్రమే చూస్తున్నాం. కొన్ని కొన్ని కథలు చదువుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి. కన్నీళ్లు దారాళంగా కారుతాయి. నవీన్ పట్నాయక్ విషయంలో అవి రెండు జరుగుతాయి. ఎందుకంటే అతడు ధీరో ధాత్తుడు కాబట్టి.