భారత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రమణ నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మధ్యవర్తిత్వం అవసరాన్ని కూడా పలుమార్లు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భార్యాభర్తల మధ్య పొడచూపిన గొడవను దగ్గరుండి మధ్యవర్తిత్వం వహించి ఇద్దరు కలిసేలా చేశారు. సాధారణ ప్రజలకు సైతం న్యాయం అందుతుందని చెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం గుంటూరు జిల్లా గురజాల డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న కళ్లెం శ్రీనివాస శర్మకు 21 ఏళ్ల క్రితం 1998లో శాంతితో వివాహం జరిగింది. 1999లో వారికి ఓ కొడుకు పుట్టాడు. తరువాత దంపతుల మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో శాంతి శ్రీనివాస శర్మపై 498 సెక్షన్ కింద కేసు పెట్టింది. దీంతో గుంటూరు కోర్టు ఏఢాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. 2010లో హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు శిక్ష తగ్గించింది. శాంతి తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు జస్టిస్ రమణ పరిధిలో విచారణకు వచ్చింది.
కేసును పరిశీలించిన జస్టిస్ రమణ మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఆలోచించారు. ఇందులో భాగంగా వారి కేసుకు పరిష్కార మార్గాన్ని సూచించారు. శిక్ష కావాలా జీవితానికి పరిష్కారం కావాలా అని వారినే అడిగి వారి జీవితానికి భరోసా కల్పించాలని సంకల్పించారు. దీంతో దంపతులిద్దరూ కేసు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని కాపురం చేసుకోవాలని సూచించారు.
సుప్రీంకోర్టుకు వచ్చిన గృహహింస కేసును సునాయాసంగా పరిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దశాబ్దాల పాటు పెండింగులో ఉన్న కేసును చాకచక్యంగా పరిష్కరించి వారికి మార్గం చూపిన రమణపై హర్షం వ్యక్తం అవుతోంది. మానవీయ కోణాలే పరిష్కారమనే సందేశాన్ని ఇచ్చిన జస్టిస్ రమణ న్యాయవ్యవస్థకే ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడారు.