Pawan Kalyan- NTV: అధికారంలోకి వచ్చేందుకు నేతలు నానా గడ్డీ కరుస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తీరు మార్చుకుంటారు. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంటామంటే కుదరదు. ఇదే సూత్రీకరణ న్యూస్ చానల్స్ కు కూడా వర్తిస్తుంది. కానీ అది ఎన్ టీవీకి ఒంట బట్టినట్టు లేదు. నెంబర్ వన్ స్థానం కోసం నానా గడ్డీ కరిచిన తర్వాత.. తీరా ఆ స్థానంలోకి వచ్చినా కూడా ఆ ఛానెల్ తన తీరు మార్చుకోవడం లేదు. పైగా గల్లీ స్థాయి యూ ట్యూబ్ చానెల్ లాగా వ్యవహరిస్తోంది. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్లెయిన్ అండ్ నీట్ కవరేజ్ కు వక్ర భాష్యం చెప్పి ఆ టీవీ9 బాటలో పయనిస్తోంది.
ఇదేం కవరేజీ?
మిగతా చానల్స్ గురించి పక్కన పెడితే ఎన్టీవీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది మొదటి స్థానంలో ఉంది కాబట్టి.. సమాజం దానిని నెంబర్ వన్ గా అంగీకరించింది కాబట్టి.. దానికి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. అందువల్లే ప్రసారం చేసే ప్రతి వార్తకు కూడా అది జవాబుదారీగా ఉండాలి. అదేంటో కానీ దానికి ఎన్ టివి దూరంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే తానా వేదికగా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉచిత విద్యుత్ కు సంబంధించి మాట్లాడారు. అందులో ఉచితాల వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. వాస్తవానికి ఒక వార్తలాగా చూస్తే దానిని పెద్ద సెన్సెషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది. టీ న్యూస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ డప్పు కొట్టింది. దీంతో భారత రాష్ట్ర సమితి శ్రేణులు రెచ్చిపోయాయి.. ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నాయి. వాస్తవానికి ఎన్ టివి దీనిని ఒక వార్తలాగా ప్రసారం చేసి ఉంటే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ దానికి తన సొంత భాష్యం చెప్పడంతోనే ఇక్కడ సమస్య మొదలైంది. దీంతో కడుపు మండిన కాంగ్రెస్ నాయకులు ఎన్ టీవీ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ విషయంలోనూ..
ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో వాలంటీర్లకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎన్టీవీ వక్ర భాష్యం చెప్పింది. వాలంటీర్లను మొత్తం పవన్ కళ్యాణ్ అవమానించారని సొంత పైత్యం దానికి యాడ్ చేసింది. సాక్షి ధీటుగా వార్త కథనాలు ప్రసారం చేసింది. స్థలానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలు ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కువగా అపహరణకు గురవుతున్నారు? వాలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి దీనిని వార్తలాగా చూస్తే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. అదేం దరిద్రమో కానీ ఎన్టీవీ ఈ వార్తను చిలువలు పలువలుగా ప్రచారం చేసింది. అది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
విలువలు పాటించరా?
బార్క్ రేటింగ్స్ లో ఎన్నో చానల్స్ ఉండవచ్చు.. కానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఛానల్ కు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాలలో దానికి రీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ప్రసారం చేసే ప్రతి వార్తను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్టీవీ యాజమాన్యం నెంబర్ వన్ స్థానం లోకి చేరుకున్నప్పటికీ తన బుద్ధులను ఇంకా మార్చుకోవడం లేదు. అందుకే జనాలు సంసారంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.. కానీ ఈ విషయమే ఎన్టీవీ కి తెలిసినట్లు లేదు. అన్నట్టు ఆ మధ్య కేటీఆర్ నెంబర్ వన్ స్థానాలు ఉన్న ఎన్టీవీ కి రాకుండా మానేసి.. టీవీ9 ఛానల్ కు వెళ్లారు. దీనిని బట్టి ఎన్టీవీ యాజమాన్యానికి ఏమైనా అర్థమవుతోందా? అంటే ఇక్కడ ఎన్ టివి సుద్దపూస అని కాదు. టీవీ 9 పులు కడిగిన ముత్యమని కాదు. వ్యక్తిత్వ హననంలో, భారత రాష్ట్ర సమితికి డప్పు కొట్టడంలో దొందూ దొందే!
Bhaskar is a senior Journalist covers articles on Politics, General and entertainemnt news.
Read More