NTR- Venkaiah Naidu: వెంకయ్యనాయుడు పొలిటికల్ కెరీర్ ను చెడగొట్టిన ఎన్టీఆర్

జన్ సంఘ్ నుంచి బీజేపీగా మారిన రోజులవి. అటల్ బిహారీ వాజ్ పేయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడే విద్యార్థి సంఘాల నుంచి రాజకీయాల వైపు వెంకయ్యనాయుడు అడుగులు వేస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 21, 2023 9:45 am

NTR- Venkaiah Naidu

Follow us on

NTR- Venkaiah Naidu: భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి అవుతారని భావించినా పదవి వరించలేదు. ప్రధాని మోదీ, షా ద్వయం అనూహ్యంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టారు. అప్పటి నుంచి దేశ వ్యాప్త పర్యటనలు, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ వెంకయ్యనాయుడు కాలం వెళ్లదీస్తున్నారు. అయితే తాను ఇంకా పెద్దస్థాయికి చేరుండేవాడినని.. కానీ నా పొలిటికల్ కెరీర్ ప్రారంభంలో తప్పటడుగులు కారణంగానే అది సాధ్యపడలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఎన్టీఆర్ ను కారణంగా చెబుతున్నారు.

జన్ సంఘ్ నుంచి బీజేపీగా మారిన రోజులవి. అటల్ బిహారీ వాజ్ పేయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడే విద్యార్థి సంఘాల నుంచి రాజకీయాల వైపు వెంకయ్యనాయుడు అడుగులు వేస్తున్నారు. బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడుబోసుకుంది తెలుగుదేశం పార్టీ. రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్ ను గద్దె దించడమే. భావసారుప్యత ఉండడంతో రెండు పార్టీల మైత్రికి కారణమైంది. అదే సమయంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు వెంకయ్యనాయుడు సన్నద్ధమయ్యారు. కానీ ఎన్టీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు.

1985లో ఎంపీగా పోటీ చేయాలని వెంకయ్యనాయుడికి సలహా ఇచ్చారు. అటు వెంకయ్యనాయుడు సైతం పోటీకి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. మీరు లోక్‌సభకు వెళితే ఇక్కడ కాంగ్రెస్‌ వాళ్లు అన్నిరకాల ఇబ్బందులు పెడతారు. ఇక్కడే తనకు సహాయం చేయడానికి ఉండాలని కోరారు. దీంతో వెంకయ్యనాయుడు ఎంపీగా పోటీచేయకుండా ఉండిపోయారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అది తన రాజకీయ జీవితంలో తొలి తప్పిదమని వెంకయ్యనాయుడు ఇప్పటికీ చెబుతుంటారు.

1989లో వెంకయ్యనాయుడు రెండోసారి బరిలో దిగారు. టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీచేశారు. అప్పుడు కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్ష పోటీకి దూరమయ్యారు. రాజ్యసభ వంటి నామినేటెడ్ పోస్టులతో సరిపెట్టుకున్నారు. అయితే నాడు ఆ రెండు తప్పులు చేయకపోయి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని వెంకయ్యనాయుడు విశ్లేషిస్తుంటారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తన అభిప్రాయంతో ఎన్టీఆర్ సైతం ఏకీభవించారని సభాముఖంగా ప్రకటించారు.