NTR Away From His Children Marriage: ఇంటి పెద్ద లేకుండా ఆ ఇంట్లో వివాహం జరుగుతుందా? అటువంటిది ఎన్టీఆర్ లేకుండానే బాలక్రిష్ణ, రామక్రిష్ణల వివాహాలు అయ్యాయి. 1982 డిసెంబరు 8న ఎన్టీఆర్ ఇంట్లో పెళ్లిబాజాలు మోగాయి. కానీ ఆ సమయంలో పార్టీ ప్రకటన, ఎన్నికల సన్నద్ధతలో ఎన్టీఆర్ ఉన్నారు. పిల్లల పెళ్లి సంబంధాల విషయంలో అన్నీ మాట్లాడిన ఎన్టీఆర్.. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నందున వారి వివాహాలకు మాత్రం హాజరుకాలేకపోయారు. వధూవరులను ఫోన్‌లో ఆశీర్వదించారు. బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లి రోజున ఎన్టీఆర్ లేకపోవడంతో బసవతారకం కన్నీరుపెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆయన్ను చూడకుండా ఉండలేనంటూ నెల్లూరు జిల్లాలో ప్రచారం చేస్తున్న ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ జిల్లాలో ఆయన పర్యటించే ఒక ప్రాంతంలో ఆయన రాక కోసం వేచి చూశారు. అడుగడుగునా జనం వెల్లువెత్తడంతో చాలా గంటలు ఆలస్యంగా ఎన్టీఆర్ అక్కడికి చేరుకున్నారు. జనం మాత్రం చెక్కుచెదరని అభిమానంతో ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఆయన్ను చూసి వారిలో ఆనందం వెల్లువెత్తింది. నల్లగా మారిన ఎన్టీఆర్‌ను చూడగానే బసవతారకం దుఃఖం ఆపుకోలేకపోయారు. ఈ రాజకీయాలు వద్దు. నాకు, నా పిల్లలకు మీరే కావాలి అంటూ ఎన్టీఆర్‌ను పట్టుకుని భోరున విలపించారు. ఎన్టీఆర్ ఆమెను ఓదార్చి… జనాన్ని చూపిస్తూ వీళ్లంతా ఎవరు తారకం? వీరు మాత్రం మనవాళ్లు కారా? అన్నారు. ఆ మాటతో బసవతారకం ఊరట చెందారు.

మొండి ఘటం
ఎన్టీఆర్ చాలా పార్శ్యాలు ఉన్నాయి. ఎంత ప్రేమ చూపిస్తారో అంత మొండిఘటం. చిత్తూరు జిల్లాలో ప్రచారం చేస్తుండగా గుర్రంకొండలో ఏర్పాటు చేసిన స్టేజీపై చాలామంది ఎక్కారు. దీంతో… వేదిక కూలిపోయింది. ఎన్టీఆర్ కాలికి గాయమై, రక్తం ధారగా కారింది. గాయాన్ని పట్టించుకోకుండా, కార్యకర్తలు వద్దని చెప్పినా చైతన్యరథంపైకి ఎక్కి ఎన్టీఆర్ ఉపన్యసించారు. ఆ తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో ఆయనకు మరో రెండుసార్లు దెబ్బలు తగిలాయి. అయినా, వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన ప్రచారం కొనసాగించారు. ఒకసారి చైతన్యరథంలో ఏకబిగిన 23 గంటలు ప్రచారం చేశారు. ప్రచార రథంపై రెండు ఫ్లడ్‌లైట్లు బిగించి, వాటి కాంతి ఎన్టీఆర్‌పై పడేలా ఏర్పాట్లు చేయడంతో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఎన్టీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఎదురుచూసేవారు. అన్నపానీయాలూ సరిగా ఉండేవి కావు. మధ్యాహ్నం తినాల్సిన అన్నం ఏ సాయంత్రానికో, రాత్రికో చల్లగా అయిపోయాక తినాల్సివచ్చేది.

Also Read: Analysis on Pawan Kalyan Questions YCP : పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలేవి ?
Recommended Video: