Contractors Fires On AP Govt: కాంట్రాక్టర్లు ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. చిన్న పని నుంచి భారీ ప్రాజెక్టు వరకు సర్కారు కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా పనులకు పిలిచి.. తమకు నచ్చిన విధంగా చేసుకుంటుంది. చేసిన పనికి గవర్నమెంటు ఆర్డరు రూపంలో బిల్లులు అప్పగించేస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఆందోళన బాట పడుతున్నారు. రెండుమూడు సంవత్సరాలుగా సర్కారు పథకాలకు సంబంధించిన అన్ని రకాల పనులు చేస్తున్నా.. రూపాయి బిల్లుకూడా మంజూరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా సమస్యను సర్కారు దృష్టికి తీసుకెళ్తున్నా.. తమను ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదని సంబంధిత శాఖ అధికారులు నిధులు లేవని తప్పించుకు తిరుగుతున్నారని చెబుతున్నారు. దీంతో తాము అన్ని పనులు చేసి.. రోడ్డున పడే పరిస్థితి ఎదురైంది వాపోతున్నారు.

ఏపీలో జగన్ సర్కారు చేసే చిన్నచిన్న పనులుసైతం కాంట్రాక్టర్లే చేస్తారు. కొన్నాళ్లుగా బిల్లులు రాకపోవడంతో చిన్నాచితక కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. భిక్షాటన లాంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రెండేళ్లుగా తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించడం లేదని.. అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశామని.. బిల్లులు రాకపోవడంతో బతకడం కష్టంగా మారిందని చెబుతున్నారు.ప్రభుత్వంలో ఏపని చేయాలన్నా కాంట్రాక్టర్లే చేయాలి. రెండేళ్లనాటి జగన్ ప్రమాణ స్వీకార వేదిక పనులు కూడా అధికారులు కాకుండా కాంట్రాక్టర్లకే అప్పగించేశారు. వాటికి సంబంధించిన బిల్లులు సైతం ఏడాది కాలం తరువాత ప్రత్యేక జీవో ద్వారా విడుదల చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి మరింత దిగజారింది. అప్పుడన్నా ఎంతోకొంత వచ్చిన బిల్లులు ఇప్పుడు రూపాయి కూడా రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు రోడ్డున పడుతున్నారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఆపుతున్న బిల్లలు మాత్రమే కాదు.. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేస్తున్న వారికి సైతం బిల్లులు రావడం లేదు. ఇన్నాళ్లు.. వస్తాయని ఆశగా ఎదురుచూసినవారు ఇప్పుడు కొన్నాళ్లుగా రోడ్డెక్కుతున్నారు. తమ బిల్లులు చెల్లించాల్సిందేనని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కోర్టే దిక్కని.. అయితే అలా చేస్తే.. మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని మరలా ఆలోచన చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.. అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపుతున్న ప్రభుత్వం అన్ని పథకాలకు సంబంధించిన నిధులు మాత్రం ఠంఛన్ గా విడుదల చేస్తోంది. ప్రతి పథకానికి వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. తమకూ సమయానికి బిల్లులు చెల్లించిన తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు చిన్నచిన్న పనులు చేసే కాంట్రాక్టర్లు.. ఈ విషయంలో సీఎం జగన్ దృష్టి పెట్టాలని తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని కోరుతున్నారు.