RTC Bus Driver: నడిరోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 14 మందిపై కేసు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది. దాడి చేసింది వైసీపీ నేతలేనని.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులని వార్తలు వచ్చాయి. దీనిపై ఆందోళనకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. అటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన వారిని టిడిపి, జనసేన నేతలుగా చూపుతుండడం విశేషం.
బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిందితులపై కేసులు నమోదు చేయించింది. కారులో వెంబడించి డ్రైవర్ పై దాడి చేసిన 14 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
అయితే ఈ ఘటనకు పాల్పడింది టిడిపి, జనసేన నాయకులేనని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం విడుదల చేశారు. ఈ కేసునకు సంబంధించి దేవరకొండ సుధీర్ బాబు, గుర్రంకొండ కిషోర్, గుర్రంకొండ అరుణ్ కుమార్, కర్రెక్టుల విజయ్ కుమార్, పుట్టా శివ కుమార్ రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇదివరకే కేసులు, రౌడీ షీట్లు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పలువురు టిడిపి, జనసేన నాయకులతో వీరు తీయించుకున్న ఫోటోలను సైతం పోలీసులు వెల్లడించడం విశేషం.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ దుమారానికి దారితీసింది. నిందితులంతా వైసిపి నేతలేనని ప్రచారం జరగడంతో భారీ డ్యామేజ్ జరిగింది. అయితే ఇప్పుడు వారంతా వైసిపి వారు కాదని.. టిడిపి, జనసేన సానుభూతిపరులని పోలీసులు తేల్చడం విశేషం. ఈ ఘటన నుంచి నష్ట నివారణకు గానే తమ పార్టీపై నిందలు మోపుతున్నారని టిడిపి, జనసేన నాయకులు చెబుతున్నారు. ఇది మరింత రాజకీయ దుమారానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.