TRS Plenary 2021: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రం అంతా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ఉత్సవాలు జరుపుకుంటోంది. దీంతో హైదరాబాద్ ప్రాంతంలో సందడి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గులాబి జెండాలతో గుబాలిస్తోంది. రహదారుల వెంట, ముఖ్య కూడళ్లలో, గల్లీలలో టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. లోకల్ లీడర్లు తమ ఖ్యాతిని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం అందరినీ ఆలోచనల్లో పడేలా చేస్తోంది. అదేంటంటే అన్ని దాదాపు అన్ని ఫ్లెక్సీల్లో మంత్రి కేటీఆర్‌కు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడం. కేసీఆర్ తరువాత పార్టీలో ముఖ్య స్థాయిలో ఉన్న కేటీఆర్ కు ఇలా ఎందుకు ప్రియారిటీ ఇవ్వలేదని ప్రశ్నించుకుంటున్నారు.

ఎన్ని రోజులు హైలెట్ చేసి.. ఇప్పుడెందుకు ఇలా ?
ఇటీవల ప్రతీ విషయంలోనూ టీఆర్ ఎస్ నాయకులు కేటీఆర్‌ను హైలెట్ చేసి మాట్లాడుతున్నారు. మాటల సందర్భాల్లో, సభలు, సమావేశాల్లో కేసీఆర్ తరువాత తమ నాయకుడిగా కేటీఆర్ కే అవకాశం ఉంటుంది. తమ యువ నాయకుడు కేటీఆరే అంటూ ఆకాశానికెత్తుతున్నారు. తదుపరి సీఎం కేటీఆరే అంటూ చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. కానీ పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఫ్లెక్సీలో మాత్రం కేటీఆర్‌కు ఎందుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అందరూ చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏమై ఉంటుందని చర్చలు నిర్వహించుకుంటున్నారు.

అంతర్గత ఆదేశాల కారణమా ?
పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుకలను హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. దీని కోసం హాజరయ్యే అతిథులు, గులాబి లీడర్ల కోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేశారు. ఇతర పార్టీలు ఈర్ష పడేంత గ్రాండ్‌గా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో కేటీఆర్‌కు ఫొటోలకు ప్రాధాన్యత దక్కకపోవడానికి పార్టీ అంతర్గతంగా జారీ చేసిన ఉత్తర్వులే కారణమని తెలుస్తోంది. ఈ ప్లీనరీ సమావేశాల్లో ఎలాగూ కేసీఆరే అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఇందులో కేవలం ఆయనకు మాత్రమే ప్రాధాన్యత దక్కాలని, అనవసరంగా ప్రజల దృష్టిని మరల్చే విధంగా కేటీఆర్ ఫొటోలకు ప్రధాన్యత ఇవ్వొద్దు అని అందులో ఉన్నట్టు తెలిసింది. అందుకే కేటీఆర్‌కు ప్రాధాన్యత దక్కలేదని తెలుస్తోంది.

ఇన్ని వేల ఫ్లెక్సీలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో ?
ఈ ఫ్లెక్సీలపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారోనని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలలో కేటీఆర్ గమనించాల్సింది తనకు ప్రాధాన్యత దక్కకపోయిన విషయం కాదని, పర్యావరణానికి హాని కలిగించే ఇన్ని ఫ్లెక్సీల ఏర్పాటు గురించని హైదరాబాదు వాసులు చెబుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేళ దీనిపై ఎలా స్పందిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, మొక్కలు నాటాలని చాలా సందర్బాల్లో కేటీఆర్ సూచించారు. మరి ప్లీనరీ సందర్బంగా ఏర్పాటు చేసిన ఇన్ని వేల ఫ్లెక్సీలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.