Congress: ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడితే నష్టం ఎవరికి? అధికారంలో ఉన్న వైసీపీకా? తెలుగుదేశం పార్టీ కా? అంటే కచ్చితంగా వైసీపీకే అంటారు. ఎందుకంటే వైసీపీలో ఉన్నది కాంగ్రెస్ క్యాడరే. దాదాపు 80 శాతానికి పైగా నాయకులు కూడా కాంగ్రెస్ వారే. ఆపై పిసిసి పగ్గాలు వైయస్ షర్మిల తీసుకోవడంతో.. ఆయన సోదరుడు పార్టీ అయినా వైసీపీకి తీరని నష్టమని ఇప్పటివరకు అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన , బిజెపి లతో పొత్తు పెట్టుకోవడంతో దాదాపు 31 అసెంబ్లీ, 8 వరకు పార్లమెంట్ స్థానాలను కోల్పోయింది. టిడిపి కేవలం 141 నియోజకవర్గాలకి పరిమితం కానుంది. దీంతో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న టిడిపి నాయకులకు ఇది మింగుడు పడని పరిణామమే. వారు కచ్చితంగా ఈ ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్నారు. ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. అటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ వేదికగా నిలుస్తోంది.
తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి నేత పాసర్ల ప్రసాద్(Pasarla Prasad) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన టిడిపి టికెట్ ను ఆశించారు. బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు. గత 20 సంవత్సరాలుగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆర్థికంగా బలమైన నాయకుడు కూడా. టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీటిడిపి హై కమాండ్ అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే గణబాబుకు టికెట్ కేటాయించింది.దీంతో ఆయన పార్టీ రాజీనామా చేశారు.ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించారు.కానీ ఏదైనా పార్టీ తరఫున అయితే బాగుంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడంతో ఆ పార్టీలో చేరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఓట్లకు భారీగా గండి పడనుంది.
అయితే ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు.పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన స్థానాల్లో చాలామంది టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే షర్మిల రూపంలో కాంగ్రెస్ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది.కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం యాక్టివ్ అవుతోంది.సరిగ్గా ఇటువంటి తరుణంలోనే టిడిపిలో బలమైన నేతలు కాంగ్రెస్ వైపు వస్తే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం వైసీపీకి నష్టమని భావించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సైతం నష్టమని తెలియడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.