
ఈ దేశంలో ‘‘అన్నం దొంగిలించిన వాడికి శిక్ష పడుతుంది.. దేశాన్ని దోచిన వాడికి స్వేచ్ఛ లభిస్తుంది..’’. ‘‘పంట రుణం తీసుకున్న బక్క రైతు ఇళ్లు వేలానికి వస్తుంది.. బ్యాంకుల్లో వేలకోట్లు దోచుకున్నవాడికి రెడ్ కార్పెట్ పరుచుకుంటుంది’’అని ఈ దేశంలో చాలా మంది నమ్ముతున్నారు. ఇందుకు సాక్ష్యం ఏమంటే.. విజయ్ మాల్యా మొదలు ఎంతో మందిని చూపిస్తుంటారు. అంతేకాదు.. రాజకీయ పార్టీలే వారి వెన్నంటి ఉన్నాయనే బలమైన నమ్మకం కూడా ఉంది. అయితే.. తాజాగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ విషయంలో చోటు చేసుకున్న పరిణామం.. భవిష్యత్ పై ఆశలు పెంచుతోంది.
బ్యాంకుల ఉద్దేశం ఏమిటి? అవసరమైన ప్రజలకు స్వల్ప వడ్డీలకు రుణాలిచ్చి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఊతమివ్వడం. కానీ.. వాస్తవంలో అందుకు పూర్తి భిన్నమైన పద్ధతిలో బ్యాంకులు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. పేద రైతులకు రుణాలు ఇవ్వడానికి నానా కొర్రీలు పెడుతున్న బ్యాంకర్లు.. అప్పటికే ‘బలిసిపోయిన’ వారికి మాత్రం వేల కోట్ల రుణాలు ఇచ్చేస్తున్నాయి. అంతేకాదు.. సామాన్య జనం కొద్దిపాటి రుణాన్ని సమయానికి చెల్లించకుంటే.. టంచనుగా జప్తు చేయడానికి సిద్ధమయ్యే బ్యాంకర్లు.. వేల కోట్లు తీసుకొన్నవారు దేశాలు దాటిపోయే వరకూ నోరు మూసుకొని ఉండడం పట్లా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఉదంతాలతో.. ఈ దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా బలమైనవాడికోసమే వ్యవస్థలు పనిచేస్తున్నాయనే నమ్మకం పాతుకుపోయిందనేది కాదనలేని కఠిన వాస్తవం.
అయితే.. తాజాగా మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ ఆస్తులను వేలం నిర్వహించడం.. తద్వారా 9 వేల కోట్ల మేర రికవరీ చేయడం సానుకూల పరిణామం. మోసాలకు పాల్పడుతూ అధికారాన్ని, పరిచయాలను అడ్డం పెట్టుకొని పెద్ద మనుషుల్లా చెలామణి అవుతున్న వారికి ఇది ఖచ్చితంగా మింగుడ పడని వార్తే. అయితే.. ఇది కేవలం ఈ ముగ్గురి తోనే ఆగిపోతుందా..? ఇతరులకు సైతం వర్తిస్తుందా? అన్నది ఆసక్తికరం. కాగా.. ఈ ముగ్గురి నుంచి కూడా పూర్తి రుణాలు రాబట్టలేదు. అవన్నీ రాబట్టి, వీళ్లకన్నా పెద్ద మొత్తంలో దోచేసి దేశంలోనే దర్జాగా తిరుగుతున్న కేటుగాళ్ల పనికూడా పట్టాలని కోరుతున్నారు జనం.
వేలు, లక్షల కోట్లు దోచుకొని రాజకీయాల్లో కొనసాగుతున్న వారికి కొదవలేదు. కొన్నాళ్ల వరకూ బిజినెస్ లకే పరిమితమైన ఈ దోపిడీదారులు.. అధికారంలో ఉండడం ద్వారానే తమ నేరాలు బయట పడకుండా చూసుకోవచ్చని, ఆయా పార్టీల్లో చేరిపోతున్నారు. వీళ్లు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు ఏదో వెలగబెట్టడానికి కాదు. తమ ఆస్తులను కాపాడుకోవడానికి, శిక్షల నుంచి తప్పించుకోవడానికి అందుకే.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. అందులో చేరిపోతుంటారు. మరి, ఇలాంటి వాళ్ల విషయంలోనూ చట్టం ఇదే విధంగా పనిచేస్తుందా? అన్నది ప్రశ్న. నిజంగా.. దోపిడీ దారులందరి విషయంలో కఠినంగా చట్టం వ్యవహరిస్తే.. మరో భారత్ ను చూడడం అసాధ్యమేమీ కాదు.