Uttarandhra Poverty: ఉత్తరాంధ్రలో పేదరికం తగ్గింది.. మీరు చదివింది నిజమే. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. జాతీయ బహుముఖ పేదరిక సూచీ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. గతంతో పోల్చుకుంటే ఏపీలో దాదాపు సగం వరకు నిరుపేదలు తగ్గారని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది.
పౌష్టికాహారం, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంట నూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండడం.. వంటి 12 అంశాలను ప్రామాణికంగా తీసుకుని నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. అందులో ఉత్తరాంధ్రలో పేదరికం గణనీయంగా తగ్గిందని తేలింది.
ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. 2016తో పోల్చుకుంటే.. ఇప్పటికి పేదల సంఖ్య తగ్గింది. శ్రీకాకుళం జిల్లాలో 2016 నాటికి 14%… ప్రస్తుతం 5.20 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు. విజయనగరంలో 19 శాతం ఉండే పేదలు 8.66 శాతానికి తగ్గుముఖం పట్టారు. విశాఖ జిల్లాలో 15.10% పేదలు ఉండేవారు.. ప్రస్తుతం వారి సంఖ్య 7.60 శాతానికి తగ్గినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2016 డిసెంబర్ నాటికి 11.77 శాతం పేదలు ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గుముఖం పట్టినట్లు నివేదిక తేల్చింది.
అయితే ఇది వైసీపీ సర్కార్ చర్యల పుణ్యమేనని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడం వల్ల.. వారిలో ఆర్థిక పురోగతి పెరిగిందని చెప్పుకొస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలతో.. ఈ 12 అంశాల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ముందంజ వేయడం వల్లే.. ఈ ఘనత సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.