నామినేషన్లకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ తమ నాగార్జునసాగర్ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రయోగాలకు పోకుండా చనిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వారసుడికే పట్టం కట్టింది.
తాజాగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది.
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా నోముల భగత్ కు బీఫాం అందజేశారు.
టీఆర్ఎస్ నుంచి ఈ టికెట్ కోసం ఈసారి భారీ పోటీ నెలకొంది. సాగర్ సీటు కోసం ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ , బాలరాజు యాదవ్ తదితరులు పోటీపడ్డారు.
వీరందరి పేర్లను పరిశీలించిన కేసీఆర్ నియోజకవర్గంలో సర్వేలు చేయించారు. నల్గొండ జిల్లా పార్టీ నేతలతోపాటు ఇన్ చార్జులు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు.
పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసుడికే అవకాశం ఇవ్వడం మేలు అని టీఆర్ఎస్ అధినేత భావించారు. దీంతో నోముల భగత్ కే టికెట్ ఇచ్చారు.