
ఇవాళ తారీఖు పది. కానీ.. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదు! ఈ ఒక్క నెల మాత్రమే కాదు. గడిచిన అర్ధ సంవత్సర కాలంగా ఇదే దుస్థితి! ఇదీ.. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి!! ప్రతి నెలా 10 నుంచి 12వ తేదీ వరకు వేతనాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారంటే.. ప్రస్తుత తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీతాలు పడే రోజు.. రానురానూ మరింత వెనక్కి జరిగిపోతుందేమోననే ఆందోళన కూవా వారిని వెంటాడుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కలుపుకొని మొత్తం 9 లక్షల 27 వేల 522 మంది ఉన్నారు. వీరికి వేతనాలు, పెన్షన్లు చెల్లించడానికి ప్రతి నెలా 2 వేల కోట్ల నుంచి 2,500 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోవడం.. రైతుబంధు, ఆసరా వంటి పథకాలు ప్రవేశపెట్టడం వంటి కారణంగా.. డబ్బులు సర్దుబాటు చేయలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలోని జిల్లాలను కేటగిరీలుగా చేసి రోజుకో రెండు మూడు జిల్లాలకు వేతనాలు వేస్తున్నారట. ఇలా దశలవారీగా జీతాలు ఉద్యోగుల అకౌంట్లోకి జమ చేయడం పూర్తయ్యే సరికి ప్రతినెలా 10 నుంచి 12వ తేదీ వరకు పడుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్లేకపోవడంతో రోజూవారీ ఆదాయాలను ఇలా లెక్కలు గట్టి ఉద్యోగులకు అందజేస్తున్నట్టు సమాచారం.
సోమవారం నాటికి జూలై నెల జీతాలు ఇంకా 13 జిల్లాలకు అందలేదని సమాచారం. నల్గొండ, యాదాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, హన్మకొండ, జనగామన, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు అందలేదు. దీంతో.. ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. మరి, ఈ పరిస్థితిని తెలంగాణ సర్కారు ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.