మూడు వారల పాటు విధించిన లాక్ డౌన్ సమయం ముగిసి, కొన్ని మార్పులతో ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్న మోదీ ప్రభుత్వం నిర్దుష్టమైన ప్రణాళిక లేక సతమత మవుతున్నదా? ఒక ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలకు ఇబ్బంది పడుతున్నదా?
ముందస్తు సంసిద్ధత లేకుండా అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో కోట్లాది మంది పేదలు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి లేక రోజువారీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి, ఆశ్రయం లేక రోడ్డున పడ్డారు.
ఈ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు గ్రామీణ భారతం తీవ్ర కష్టాలు పడుతోంది. నగరాలు, పట్టణాల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆంక్షలు, నిర్బంధంతో వేలాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్రప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో నిరుద్యోగిత రేటు 23 శాతం తాకిందని సిఎంఐఇ డేటా పేర్కొనడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటువంటి పరిణామాలను ఈ ప్రభుత్వం వద్ద సమాధానాలు కనిపించడం లేదు. రెండు నెలలుగా దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నా, ఇప్పటికీ వైద్య సిబ్బందికి సరైన రక్షణ సదుపాయాలు లేవు. భారత్‌లో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత తీవ్రస్థాయిలో ఉండటంతో ఈ వైరస్ తీవ్రతపై పూర్తి అంచనాకు రాలేక పోతున్నాము. ఉదాహరణకు బీహార్‌లో 10 వేల కిట్లు అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం 250 మాత్రమే కల్పించింది.
భారత్‌లో పేలవంగా ఉన్న వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపించడం లేదు. ఉన్న ఆసుపత్రుల్లో కొన్నింటికి కోవిడ్ ఆసుపత్రులుగా మార్చిందే తప్ప చైనా, యుకెల మాదిరిగా ప్రత్యేకంగా ఆసుపత్రులను నిర్మించే ప్రయత్నం చేయడం లేదు.
భారత్‌లో భారీ సంఖ్యలో ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాటిల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనాభాతో పోల్చుకుంటే బెడ్‌ల సంఖ్యగా తక్కువగా ఉంది.
49 వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్ పెట్టామని చెబుతున్న కేంద్రం అవి ఎప్పుడు అందుతాయో చెప్పలేకపోతోంది. కరోనాపై యుద్దంలో ముందు వరుస లో నిలబడిన వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ)ల ఉత్పత్తికి సమయం పడుతుందని తయారీదారులు పేర్కొంటున్నారు. దాదాపు రూ.1.7 కోట్ల పిపిఇల కోసం ఆర్డర్ పెట్టామని ఈనెల 9న చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటివరకూ ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందన్న దానిపై మరోసారి స్పష్టత ఇవ్వలేదు.
హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతిపై ఈ నెల 4న నిషేధం విధించిన కేంద్రం అమెరికా కోరడంతో రెండు రోజుల వ్యవధిలోనే 6న సడలింపులిచ్చింది. అయితే భారత్‌లో కొరతగా ఉన్న పిపిఇలు, ఇతర వస్తువులపై అమెరికా విధించిన నిషేధంపై ఈ దేశం నుండి ఎటువంటి హామీలు పొందలేక పోయింది.