Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొందరు మేథావులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారంతా జనసేన వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అయితేనే తమకు మంచి వేదిక అవుతుందని వారు భావిస్తున్నారు. అందుకే వారు త్వరలో జనసేనలో చేరే చాన్స్ ఉందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. లోక్ సత్తా ఉద్యమసంస్థను స్థాపించి సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన భావించారు. రాజకీయ పార్టీగా మార్చి ఉమ్మడి ఏపీలో ఒకసారి బరిలో దిగారు. కానీ అంతగా వర్కవుట్ కాలేదు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కుక్కట్ పల్లి నుంచి పోటీచేసిన జేపీ ఒక్కరే గెలుపొందారు. నాడు శాసనసభలో వాయిస్ వినిపించారు. కానీ పార్టీ పరంగా ప్రభావం చూపలేకపోయారు. రాష్ట్ర విభజన తరువాత లోక్ సత్తా పార్టీ అంతగా ఉనికి చాటుకోలేకపోయింది.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా విజయవాడ లేదా విశాఖ నుంచి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి విషయంలో ప్రధాన రాజకీయ పక్షాల నుంచి ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ లో ఏపీ వాణిని, ప్రజల మనోగతాన్ని ఆవిష్కరించడంలో ఫెయిలయ్యారని జేపీ భావిస్తున్నారు. అందుకే ఎంపీగా పోటీచేసి ఏపీ సమస్యలపై గళమెత్తాలన్న నిర్ణయానికి వచ్చారు. అది జనసేన ద్వారా సాధ్యమని భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేస్తే తప్పకుండా విజయం సాధిస్తామన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న లోక్ సత్తాను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో పర్యటించిన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ వెంట లోక్ సత్తా నాయకులు కూడా కొంతమంది కనిపించారు.
మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేనలో చేరిక దాదాపు ఖాయమన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. దాదాపు 3 లక్షలకుపైగా ఓట్లు సాధించారు. ఎన్నికలకు కేవలం 15 రోజల ముందు జనసేనలో చేరిన ఆయన గట్టిపోటీ ఇచ్చారు. కానీ ఎన్నికల తరువాత పార్టీకి దూరమయ్యారు. వివిధ సమస్యలను అజెండాగా రూపొందించుకొని పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై ఫోకస్ పెంచారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ జనసేనలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నాయకులతో చర్చలు జరిపారని.. త్వరలో ఆయన పార్టీలో చేరిక ఖాయమని జనసేనవర్గాలు భావిస్తున్నాయి.

గత ప్రభుత్వాల్లో క్రియాశీలకంగా పనిచేసిన చాలామంది మేథావులు, మాజీ అధికారులు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. పైగా ప్రభుత్వ బాధితవర్గాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారు వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేనను చూస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబును నమ్మే స్థితిలో లేరు. పైగా పవన్ నేరుగా తమ సమస్యలను ప్రస్తావిస్తుండడం, తమ పోరాటాలకు సంఘీభావం తెలుపుతుండడంతో వారు కూడా జనసేన వైపే మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలతో అనుబంధం ఉండే ఈ మాజీ అధికార గణం జనసేన అయితేనే బాగుంటుందన్న డిసైడ్ కు వస్తున్నారు. అందుకే జనసేన వైపు క్యూకడుతున్నారు. పవన్ బస్సు యాత్ర ప్రారంభించే సమయంలో ఒక్కొక్కరూ పార్టీలో చేరేలా జనసేన హైకమాండ్ సైతం ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.