దసరా వస్తుందంటే చాలు.. సొంతూరు వెళ్లడానికి ప్రిపేర్ అయిపోతుంటారు జనాలు.. పల్లెకు వెళ్లి అయినవాళ్లతో పండుగ జరుపుకుంటే ఆ ఆనందమే వేరు. హైదరాబాద్ నుంచి లక్షలాది జనం పండుగకు వెళ్తుంటారు. ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుంటాయి. అయితే ఈ సారి ఆ పండుగ సంబురం కనిపించడం లేదు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో రద్దీ లేక బోసిసోతున్నాయి.
Also Read: కేసీఆర్ బడ్జెట్ భారం తగ్గించుకుంటున్నారు
మునపటిలా భారీ సంఖ్యలో జనాలు ఊర్లకు వెళ్లకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో బస్సు, రైలు ప్రయాణాలతో రిస్క్ చేయడం ఎందుకని? చాలా మంది ఆలోచిస్తున్నారు. లాక్ డౌన్ వేళ ఇండ్లకు వెళ్లిన వారు రెండు నెలల కిందటే హైదరాబాద్కు వచ్చారు. మళ్లీ ఇప్పుడిప్పుడే సొంతూళ్ల వెళ్లడం దేనికి అని భావిస్తున్నారు. మరో వైపు భారీ వర్షాలతో రోడ్లు పాడైపోవడం, వాగులు, చెరువులు తెగిపోవడంతో బస్సులు, సొంత వెహికిల్స్ పై వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయిన అనుకుంటున్నారు. పండుగ సంతోషం కన్నా ఆరోగ్యమే ముఖ్యమంటూ దసరాను నగరంలో చేసుకునేందుకే చాలా మంది మొగ్గుచూపుతున్నారు.
ఇక కరోనా నేపథ్యంలో రైలు ప్రయాణికుల కోసం ఆన్ లైన్ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. చాలా మంది సామాన్యులు ఇది తెలియక స్టేషన్లు వెళ్లి టికెట్ కౌంటర్లు లేకపోవడంతో ఇండ్లకు తిరుగుముఖం పడుతున్నారు. రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి.
ఒక్కో రైలులో 40శాతం మాత్రమే వెళ్తున్నారు. 2019లో దసరా, దీపావళి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే 780 ప్రత్యేక రైళ్లను నడిపింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్ల నుంచి ఆయా రైళ్లలో నాలుగు స్టేషన్లలో కలిపి రోజుకు 2.80 లక్షల నుంచి 3లక్షల వరకు ప్రయాణించారు. ఈసారి కరోనా కారణంగా తక్కువ రైళ్లనే నడిపిస్తున్నారు.
ఆర్టీసీలకు దసరాకు భారీ సంఖ్యలో బస్సులు నడిపి కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తుంటాయి. అయితే ఈసారి ఆర్టీసీకి నిరాశే ఎదురవుతోంది. బస్టాండ్లలో పండుగ సందడే కరువైంది. వాస్తవానికి దసరా నేపథ్యంలో నగరం నుంచి 3వేల బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయినా ఆశించిన స్పందన రాలేదు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఎంజీబీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. దసరాకు వారం రోజుల ముందు నుంచే బస్టాండ్ జనాలతో కిటకిటలాడేదని, ప్రస్తుతం రద్దే లేదని చెప్పారు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీకి గతంలో ప్రత్యేక బస్సులు నడిపివారు. ఈసారి ఇరు రాష్ట్రాల మధ్య సరైన ఒప్పందం లేక బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. మరో వైపు ప్రైవేట్ బస్సుల పరిస్థితి అలాగే ఉంది. దసరా సందర్భంగా ప్రైవేట్ బస్సులు 70శాతం వరకు అందుబాటులో ఉన్నా ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
Also Read: రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..?
మాములుగా దసరా సెలవులకు నగరం నుంచి ఏపీకి భారీ సంఖ్యలో తరలివెళ్తుంటారు. కరోనా, వర్షాల కారణంగా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్న వారు కొందరైతే… ప్రైవేట్ బస్సులు, వాహనాల చార్జీల మోత భరించలేక కూడా ప్రయాణం మానుకుంటున్నారు. దూరాన్ని బట్టి రూ.2వేలనుంచి 3వేల దాక చార్జీలు ఉండడంతో ఒక కుటుంబానికి రూ.10వేల నుంచి 15వేల దాక ఖర్చవుతుంది. అంత డబ్బు ఖర్చు బెట్టి వెళ్లడం కన్నా.. ఆ డబ్బుతో నగరంలోనే పండుగ ఘనంగా చేసుకుందామని ఫిక్స్ అయిపోయారు.