CM KCR – Media : దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో కెసిఆర్ ప్రారంభిస్తున్న తెలంగాణ సచివాలయంలో.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై తొలిరోజే ఆంక్షలు మొదలయ్యాయి. ప్రజల సొమ్ముతో కట్టిన సెక్రటేరియేట్‌లో పత్రికలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులపై సర్కారు ఉక్కు పాదాన్ని మోపింది. రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, విలేకరులు ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. కానీ ప్రభుత్వ తప్పిదాలను వెలుగులోకి తెస్తున్న పత్రికా విలేకరులకు ఈ సమావేశానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి పాస్ లు జారీ చేయలేదు. కానీ ఉత్తరాది విలేకరుల సేవలో తరించిపోయింది.
ఈ భయం ఎందుకు?
ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న పత్రికల విలేకరులు కొత్త సచివాలయంలోకి అడుగు పెడితే, మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోందని బుద్ది జీవులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ సౌధంలోకి మీడియాపై ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి దేశంలోని ఏ ఇతర రాష్ట్ర సచివాలయంలోనూ ఇలాంటి ఆంక్షల్లేవు. అక్కడ మీడియాను పాలకులు ఆదరిస్తారు. ఏదైనా అవకతవక జరిగితే విచారణకు ఆదేశిస్తారు. ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుపెట్టుకుని, అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై ఆంక్షలు విధించడం విడ్డూరమే. దీన్ని బట్టి కేవలం రాజ్యాంగ నిర్మాత పేరు వాడుకునేందుకే ప్రభుత్వం సచివాలయానికి పేరు పెట్టి, విగ్రహాన్ని కట్టిందే తప్ప.. ఆయన ఆశయాలను, మార్గాన్ని అనుసరించేందుకు కాదని తాజాగా మీడియాపై ఆంక్షలు చెబుతున్నాయి.
గతంలోనూ ఇదే పరిస్థితి
పాత సచివాలయం నుంచి తాత్కాలిక సచివాలయం(బీఆర్‌కేఆర్ భవన్)లోకి కార్యాలయాలు తరలించగా.. 2019 సెప్టెంబరు 1వ తేదీ నుంచి జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు మొదలయ్యాయి. “ఉన్నతస్థాయి ఆదేశాలతో తానేమీ చేయలేనని, మళ్లీ ఆదేశాలు వెలువడితినే అనుమతినిస్తానని, తాను ఈ విషయంలో నిమిత్తమాత్రుడినని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వ్యాఖ్యానించారు”. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత రెండు దఫాలుగా సీఎం కేసీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినా.. ఆ నిషేధం అలాగే కొనసాగింది. అందులో ఎటువంటి మార్పు పైగా పాలకులకు బాకాలు ఊదే పాత్రికేయులకు దర్జాగా బిఆర్కె భవన్లో ప్రవేశం దొరికేది. అయితే కొత్త సచివాలయంలో ఆ ఇబ్బందులు ఉండబోవని జర్నలిస్టులంతా అనుకున్నారు. కానీ ప్రారంభోత్సవం రోజే ప్రభుత్వం ఆంక్షలను విధించింది. తన నిరంకుశత్వాన్ని బయటపెట్టుకుంది. తొలిరోజు పలు మీడియా సంస్థల ప్రతినిధులకు ఆహ్వానాలు అందగా.. అది ఆదివారం ఒక్కరోజుకే పరిమితమవుతుందని, ఆ తర్వాత మీడియాపై ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.. ప్రభుత్వం కూడా ఆ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చింది.
సచివాలయం బయట పబ్లిసిటీ సెల్
ఇక మీడియాతో నిత్యం సంబంధాలుండే సమాచార శాఖకు చెందిన పబ్లిసిటీ సెల్‌ను సచివాలయం బయట ఏర్పాటు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నిజానికి బీఆర్‌కేఆర్ భవన్‌కు మారినప్పుడు మినహాయిస్తే.. పబ్లిసిటీ సెల్ ఏళ్ల తరబడి మీడియా ప్రతినిధులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. మీడియా ప్రతినిధులు వార్తలను కంపోజ్ చేసుకోవడానికి, కార్యాలయాలకు ఈ-మెయిల్ ద్వారా పంపడానికి 12 దాకా కంప్యూటర్లను పబ్లిసిటీ సెల్ అందుబాటులో ఉంచేది. నిజానికి కొత్త సచివాలయంలోని నాలుగో అంతస్తులో పబ్లిసిటీ సెల్‌కు కార్యాలయాన్ని కేటాయించాలనే ప్రతిపాదనలు ముందు నుంచి ఉన్నా.. మీడియాను దూరం పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేస్తేనో తప్ప మీడియాకు కొత్త సచివాలయంలో ఎంట్రీ ఉండదని స్పష్టమవుతోంది. ఇక ఇతర రాష్ట్రాల విలేకరులకు అగ్రతాంబూలం ఇచ్చింది. పంజాబ్, ఢిల్లీ, ఒడిసా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 70 మందికి పైగా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది. వారికి రానుపోను విమాన చార్జీలనూ భరిస్తోంది. వారి బస కోసం ఓ స్టార్ హోటల్‌లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు వారు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు భారీగానే ముట్ట చెప్పిందని తెలుస్తోంది. పైగా తెలంగాణ ప్రభుత్వం నుంచి విపరీతంగా జాకెట్ యడ్స్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మొన్నటిదాకా ఉత్తరాది అని విభజించి మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు వారిని అక్కున చేర్చుకోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టుకున్న ఆయన.. చేతల్లో మాత్రం తన నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.