
ప్రజలకు కావాల్సింది ప్రధానంగా కూడు, గూడు, బట్ట.. ఈ మూడు ఉంటే చాలు బతికేయవచ్చని అంటారు. కానీ ఇప్పుడు కరోనా కల్లోలం వేళ ప్రాణాలు కాపాడుకోవడమే అన్నింటికంటే పెద్ద టాస్క్. ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలి.
ఏపీలోని జగన్ సర్కార్ ఎప్పుడో ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చింది ఉచితంగా సేవలందిస్తోంది. పేద ప్రజలకు రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీలోనే వైద్యం అందిస్తోంది.
కానీ తెలంగాణలో కరోనా సోకితే ఇక ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. తెలంగాణలో కరోనాను ‘ఆరోగ్యశ్రీ’లో చేర్చలేదు. తొలి వేవ్ సమయంలోనే ఈ డిమాండ్ వచ్చినా కేసీఆర్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రెండో వేవ్ తో లక్షల మందికి వైరస్ సోకుతోంది. వేల మంది మరణిస్తున్నారు.
కరోనాతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఒక్క ఆస్పత్రిలో బెడ్ కోసం క్యూలు ఉన్నాయి. రూ.2.50 లక్షలు కడితేనే బెడ్స్ ఇస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి అప్పులు చేసి.. ఆస్తులు అమ్ముకొని మరీ కరోనాకు చికిత్స చేసుకుంటున్నారు. కరోనాను జయించినా చివరకు బతికి అప్పులపాలై మరోసారి చచ్చే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ కరోనా కల్లోలం వేళ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ మరోసారి వచ్చింది. ఉచితంగా వైద్యం అందించాలని ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తాజాగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఈమెతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు.
పేదల ఉసురు తీస్తున్న కరోనా వ్యాధిని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ దీనికి ఉచితంగా వైద్యం అందించేలా చేయాలని కేసీఆర్ సర్కార్ ను రోగులు, కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.