తెలుగుదేశం పార్టీ నేతల్లో సఖ్యత కొరవడింది. సమన్వయం లేక ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. పార్టీ విజయానికి కీలక భూమిక పోషించాల్సిన నాయకులు తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తస్తున్నారు. దీంతో అధినేత చంద్రబాబు నాయుడు సైతం దిద్దుబాట చర్యలు చేపట్టినా సఫలం కావడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వెనుకంజలో పడిపోయింది. పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది.
వివిధ జిల్లాల్లో విచిత్ర పరిస్థితి
పార్టీ పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. నాయకులున్నా ఐకమత్యం కొరవడి పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రత్యర్థి పార్టీని ఎదర్కోలేకపోతున్నారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ వీరిలో అనైక్యతను సొమ్ము చేసుకుంటున్నారు. విజయ తీరాలకు చేరిపోతున్నారు.
రాజమండ్రిలో గెలిచినా..
రాజమండ్రి రూరల్, సిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఢీకొట్టి గెలిచినా టీడీపీలో జోష్ కనిపించడం లేదు. దీంతో సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతో విభేదాలు బయటపడుతున్నాయి. ప్రకాశంలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినా ఇక్కడ కూడా అదే పరిస్థితి.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారున్నా..
విజయవాడలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలున్నా సొంత రాజకీయాలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వీరి ప్రభావంతో పార్టీ అపజయం మూటగట్టుకుంది. అనంతపురంలో మాజీ ఎంపీ దివాకర్ రె్డ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు సమసిపోకపోవడంతో పార్టీకి పెద్ద దెబ్బ తగులుతోంది. దీంతో పార్టీ విజయాల మాట ఎలా ఉన్నా అపజయాలు మాత్రం వీడడం లేదు.
అధినేత చెప్పినా..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి సర్దిచెప్పినా నాయకులు పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడిపోతోంది. ఒకరితో మరొకరు కలివిడిగా ఉండలేక బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా నాయకులు స్పందించి పార్టీ విజయానికి బాటలు వేయాల్సిన అవసరం ఏర్పడింది.