ఇప్పటికీ స్పష్టతరాని బోధనా మాధ్యమం

నూతన విద్యావిధానం ప్రకటించినప్పటి నుంచి బోధనా మాధ్యమం పై గందరగోళం కొనసాగుతూనే వుంది. ముందుగా విద్యావిధానం ప్రకటించిన రోజు అందరూ 5వ తరగతి వరకూ మాతృ భాషలో విద్యాబోధన తప్పనిసరి అని అనుకున్నారు. అదికూడా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు అన్నింటి లో కూడా 5వ తరగతివరకు ఖచ్చితంగా మాతృ భాషలోనే విద్య బోధన జరగాలని కొత్త విద్యావిధానం స్పష్టం చేసిందని అన్ని ప్రచార సాధనాలు, పత్రికలు వెల్లడించాయి. దానితో ఆంధ్రాలో జగన్ కి ఇంకో ఎదురు దెబ్బ […]

Written By: Ram, Updated On : August 8, 2020 6:02 am
Follow us on

నూతన విద్యావిధానం ప్రకటించినప్పటి నుంచి బోధనా మాధ్యమం పై గందరగోళం కొనసాగుతూనే వుంది. ముందుగా విద్యావిధానం ప్రకటించిన రోజు అందరూ 5వ తరగతి వరకూ మాతృ భాషలో విద్యాబోధన తప్పనిసరి అని అనుకున్నారు. అదికూడా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళు అన్నింటి లో కూడా 5వ తరగతివరకు ఖచ్చితంగా మాతృ భాషలోనే విద్య బోధన జరగాలని కొత్త విద్యావిధానం స్పష్టం చేసిందని అన్ని ప్రచార సాధనాలు, పత్రికలు వెల్లడించాయి. దానితో ఆంధ్రాలో జగన్ కి ఇంకో ఎదురు దెబ్బ తగిలిందని కూడా పత్రికలు, చానళ్ళు వ్యాఖ్యానించాయి. దీనిపై అనుకూలంగా , వ్యతిరేకంగా తెలుగు చానళ్లలో , జాతీయ చానళ్లలో కూడా చర్చలు జరిగాయి. దీనిపై కేంద్రీయ స్కూళ్ళలో ఎలా అమలుచేయాలనేది కూడా వివాదానికి దారి తీసింది. ఇంతలో మరుసటి రోజు స్కూళ్ళ విద్యా కార్యదర్శి పత్రికలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మాతృ భాషలో విద్య బోధన మార్గదర్శకాలు తప్పితే నిర్బంధం కాదని స్కూళ్ళకు, రాష్ట్రాలకు స్వేచ్చ వుందని ప్రకటించింది.

నిన్న ప్రధానమంత్రి వున్నత విద్య పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ 5వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ మాతృ భాషలోనే చదవాలని దాదాపు ఇది తప్పదన్న అర్ధంలోనే మాట్లాడటం జరిగింది. అదేసమయం లో రాష్ట్రాలు సహకరించాలని కూడా మాట్లాడాడు. ఇంతకీ అసలు పరిస్థితి ఏమిటి? మాతృ భాషలో విద్య బోధన తప్పనిసరా లేక స్వచ్చందమా? ఒకవేళ నిర్బంధమయితే ప్రైవేటు స్కూళ్ళకు వర్తిస్తుందా? దీనిపై ఈరోజుకీ స్పష్టత రాలేదు.

బోధనా మాధ్యమం ఎప్పుడూ సున్నితమైన అంశమే. తమిళనాడు లో దీని తీవ్రత రాజకీయ ప్రకంపనలు సృష్టించటం చరిత్రలో చూసాం. ఇప్పటికీ అక్కడ త్రి భాషా సూత్రం అమలు లో లేదు. ప్రస్తుత విద్యావిధానం పై కూడా డిఎంకె , అన్నా డిఎంకె కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు భాషలు నేర్చుకోమనేది వాళ్ళ వాదన. కొత్త విధానం లో సంస్కృతాన్ని, హిందీ ని బలవంతంగా రుద్దుతున్నారని వాళ్ళ వాదన. కానీ విద్యా  విధానం లో ఎక్కడా నిర్బంధంగా ఈ భాషల్ని రుద్దుతున్నట్లు చెప్పలేదు. దేశంలోని ఏ భాషనైనా సెలెక్ట్ చేసుకొనే స్వేచ్చ విద్యార్ధి కి వుంది. అలాగే వృత్తి విద్యా కోర్సులు ప్రవేశాపెట్టటాన్ని కూడా డిఎంకె వ్యతిరేకించటం ఆశ్చర్యకరంగా వుంది. అలాగే ప్రభుత్వం కూడా త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలి. మారిన పరిస్థితుల్లో 9వ తరగతి నుంచి ఫ్రెంచ్, పోర్చుగీసు, జర్మన్, స్పానిష్, జపనీస్, కొరియన్ భాషలను ఏదో ఒకటి ఎంచుకొనే స్వేచ్చ ఇవ్వటం ఆహ్వానించదగ్గది. అదేసమయం లో ముసాయిదా లో వుంచిన చైనీస్ భాషను తొలగించటం తొందరపాటు చర్య. ఈరోజు చైనా తో గొడవలు వున్నాయని ప్రపంచం లో అధికంగా మాట్లాడే భాషల్లో ఒకటైన చైనీస్ ని తొలగించ కుండా వుండాల్సింది. చైనా తో పాటు హాంగ్ కాంగ్ , తైవాన్ దేశాల్లో కూడా చైనీస్ భాషనే మాట్లాడుతారు. తిరిగి విదేశీ భాషల జాబితాలో చైనీస్ భాషను చేరిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా బోధనా మాధ్యమం ఎప్పుడూ సున్నితమైనదే. దీనిపై ఎంత త్వరగా స్పష్టత వస్తే సందేహాలకు తావులేకుండా వుంటుంది.