Uttarandhra YCP: వచ్చే ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు డిసైడ్ అయింది. తెరపైకి కొత్త ముఖాలను తీసుకురానుంది. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. సిట్టింగ్ ఎంపీలని ఎమ్మెల్యేలుగా… ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చేందుకు వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో దాదాపు ఎంపీ స్థానాల్లో కొత్త ముఖాలను తెరపైకి తెచ్చేందుకు జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి ఈసారి ధర్మాన సోదరులతో పాటు స్పీకర్ తమ్మినేని పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో గెలిచి బలమైన పునాది వేసుకున్నారు. రామ్మోహన్ నాయుడుని ఢీకొట్టాలంటే సరైన అభ్యర్థి అవసరమని జగన్ భావిస్తున్నారు. అందుకే మంత్రి ధర్మాన కానీ, స్పీకర్ తమ్మినేని కానీ, మాజీ మంత్రి కృష్ణ దాస్ కానీ సరైన పోటీ ఇవ్వగలరని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ ముగ్గురు నేతలు అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స ను బరిలో దించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంపీగా వైసిపి సిట్టింగ్ అభ్యర్థి బెల్లనా చంద్రశేఖర్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బెల్లానను ఎచ్చెర్ల నుంచి కానీ.. చీపురుపల్లి నుంచి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అదే జరిగితే విజయనగరం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.
అరకు ఎంపీ బొడ్డేటి మాధురి ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో అరకు నుంచి కానీ పాడేరు నుంచి గాని ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆమె స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిని పోటీలో పెడతారని బయట ప్రచారం జరుగుతోంది.
విశాఖ ఎంపీగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను పోటీ చేయిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన భీమిలిలో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన మార్పు అనివార్యంగా తెలుస్తోంది. కుదిరితే విశాఖ లేకుంటే అనకాపల్లి నుంచి పోటీ చేయించడానికి వైసిపి హై కమాండ్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని సైతం మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో ఎంపి స్థానాల్లో వైసిపి కొత్త ముఖాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.