YCP MPs: వైసీపీ అధినేత జగన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు వర్కుషాపు కూడా నిర్వహించారు. వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. పనితీరు మెరుగుపరచుకోని వారిని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేస్తున్నారు. గ్రాఫ్ పెంచుకోకపోతే తప్పిస్తానని హెచ్చరికలు పంపుతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. ఆపసోపాలు పడి జనం బాట పడుతున్నారు. అయితే అధినేత హెచ్చరికలపై ఎమ్మెల్యేల నుంచి భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంపీల మాటేమిటి అని వారు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న వారిలో సగం మందికి పైగా ఎంపీలకు టిక్కెట్లు డౌటే అని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు వైసీపీ నుంచి గెలిచారు. అయితే గెలిచిన ఆరు నెలల నుంచే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ అధినేతపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. మిగతా 21 మంది ఎంపీలు పార్టీ పట్ల, అధినేత పట్ల వీరవిధేయత కనబరుస్తూ వస్తున్నారు. అయితే ఇందులో సగం మందిని వచ్చే ఎన్నికల్లో తప్పిస్తారని టాక్ నడుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తుండడం, మరికొందరి తీరు సవ్యంగా లేకపోవడం, కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ తో సఖ్యత లేకపోవడం తదితర కారణాలతో పక్కన పెడతారన్న ప్రచారం అయితే ఉంది. అయితే ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండడం విశేషం.
cm jagan
అయితే తప్పిస్తున్న ఎంపీల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నందిగాం సురేష్. బాపట్ల ఎంపీగా ఉన్న సురేష్ ను తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దింపుతారని ప్రచారం ఉంది. ఈ సారి ఎంపీగా పోటీచేస్తే మాత్రం ఆ ప్రభావం పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై చూపే అవకాశం ఉంది. పార్టీలో ఆయన తీరును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మార్పు అనివార్యంగా తెలుస్తోంది. నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయుల మార్పు తధ్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన టీడీపీ నేతలతో సఖ్యతగా మెలుగుతుండడం అధిష్టానానికి రుచించడం లేదు. దాంతో పాటు అమరావతికి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారమైతే ఉంది. దీంతో ఆయన్ను తప్పించడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను తప్పిస్తారని తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్తగా బీసీ నాయకుడ్ని ఎంపిక చేస్తారని సమాచారం.
Also Read: KCR- RK: కేసీఆర్ ను ఆర్కే భయపెడుతున్నాడా?
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను కూడా తప్పిస్తారని తెలుస్తుండడం షాక్ కు గురిచేస్తోంది. ఆయన పార్టీకి, అధినేతకు వీర విధేయుడు. పార్లమెంట్ లో అయినా.. బయట అయినా పార్టీ వాణిని గట్టిగానే వినిపిస్తారు. వ్యక్తిగతంగా కూడా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయనకు పార్టీలో మిగతా నాయకులతో విభేదాలున్నాయి. ఎవరితోనూ సఖ్యత లేదు. దీంతో అధిష్టానానికి భరత్ తలనొప్పిగా మారారు. అందుకే మార్పు చేయాలని చూస్తున్నారు. అరకు ఎంపీ గొట్టేటి మాధవిని మార్చుతారన్న ప్రచారం సాగుతోంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఎంపీగా ఆమె ఫెయిలయ్యారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడినట్టు టాక్ నడుస్తోంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని పోటీచేయిస్తారని సమాచారం.
YCP
నరసాపురం ఎంపీ స్థానంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజును చెక్ చెప్పాలని భావిస్తోంది. బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడ్ని తెరపైకి తేనుంది, ఆయనకు టిక్కెట్ ఇచ్చి రఘురాజు ఏ పార్టీ నుంచి బరిలో దిగినా మట్టికరిపించాలన్న భావనతో ఉంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కాకినాడ ఎంపీ వంగ గీతకు ఈసారి ఎంపీ నుంచి తప్పించాలని అధిష్టానం ఆలోచన చేస్తోంది. విద్యాధికురాలిగా ఉన్న ఆమె ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారన్న భావన ఉంది. విజయవాడలో కూడా బలమైన నేతను బరిలో దించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ లగడపాటి రాజగోపాల్ ను పార్టీలోకి ఆహ్వానించాలని ఒక వర్గం కోరుతోంది. విజయనగరంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను మార్చడానికి అధిష్టానం మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే దాదాపు సగం మంది ఎంపీలను పక్కన పెట్టాలన్న యోచనలో వైసీపీ ఉంది.
Also Read:Congress- TRS Party: కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు పట్టుకున్న మునుగోడు భయం