https://oktelugu.com/

Nitish Kumar: కూటములను మార్చినా సీఎం కొలువు మాత్రం నితీష్ దే

బిజెపితో జేడీయూది విడదీయరాని బంధం. 1998 నుంచి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నితీష్ భావించారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 29, 2024 / 10:44 AM IST

    Nitish Kumar as Bihar CM for a record ninth time with BJP support

    Follow us on

    Nitish Kumar: బిహార్ కు తొమ్మిదో సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నితీష్ ది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. రాజకీయంగా చాణుక్యుడు అన్న పేరు ఉంది. గత పదేళ్లలో ఐదు సార్లు కూటములను మార్చారు. దేశంలోని కీలక రాజకీయ నేతల్లో నితీష్ ఒకరు. బీహార్ లో ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రం ఆయనే సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. కానీ కొద్ది రోజులకే కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీఏ గూటికి చేరారు. 2013 నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు ఆయన కూటములను మార్చుతూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు.

    1990లో అప్పటి జనతాదళ్ సీనియర్ నేత లాలు ప్రసాద్ యాదవ్ ను ముఖ్యమంత్రి చేయడంలో నితీష్ కీలక పాత్ర పోషించారు. లాలూను పెద్దన్నగా అభివర్ణించేవారు. 1994లో అదే లాలుపై తిరుగుబాటు చేశారు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నెండేజ్ తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ యూలో ఆ పార్టీని విలీనం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2005లో బిజెపితో పొత్తు పెట్టుకొని బీహార్ కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఒకే కూటమిలో కాకుండా.. వేరు వేరు కూటమిల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే కొనసాగడం విశేషం.

    బిజెపితో జేడీయూది విడదీయరాని బంధం. 1998 నుంచి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నితీష్ భావించారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా తన పేరును పెట్టాలని నితీష్ భావించారు. అయితే బిజెపి అనూహ్యంగా గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ పేరును ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నితీష్ 2013 జూన్ లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. 2017లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నితీష్ నేతృత్వంలోని జేడియూ ఒంటరి పోరుకు దిగింది. అధికారానికి అవసరమైన స్థానాలను సాధించలేకపోయింది. అప్పుడే ఆర్జెడి, కాంగ్రెస్ లతో కలిసి మహాగర్బంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. ఆ రెండు పార్టీల మద్దతుతో నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు.

    రెండేళ్లపాటు ఈ కూటమి సవ్యంగా పాలన సాగించింది. అయితే 2017లో తేజస్వి పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. పదవి నుంచి వైదొలగాలని నితీష్ కోరారు. అందుకు తేజస్వి అంగీకరించకపోవడంతో కూటమిలో మనస్పర్ధలు వచ్చాయి. 2017 జూలై 26న సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. అక్కడికి కొద్ది గంటల్లోనే బిజెపి సహకారంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ లోనే కొనసాగారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసి విజయం సాధించారు. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి, రాష్ట్ర బిజెపి నాయకుల తీరును నిరసిస్తూ 2022 ఆగస్టు 9న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆర్జెడి, కాంగ్రెస్, సిపిఐ లతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

    సుమారు 18 నెలల పాటు ఈ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది. ఇటీవల బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ చొరవ చూపారు. కూటమి నాయకత్వ బాధ్యతలు ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు. తనకు తగిన ప్రాధాన్యం లేదని గత కొంతకాలంగా నితీష్ ఆవేదనతో ఉన్నారు. మరోవైపు బీహార్లో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆయనకు నచ్చలేదు. అందుకే యూటర్న్ తీసుకున్నారు. బిజెపితో చేతులు కలిపి తొమ్మిదో సారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే నితీష్ ఇలా తరచూ కూటమిలను మార్చడంతో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలునిర్వర్తించిన వ్యక్తి.. చీటికిమాటికి పదవుల కోసం పార్టీ విధానాలను పక్కనపెట్టి వ్యవహరిస్తుండడం పై ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడియూ 115 స్థానాలను దక్కించుకుంది.. 2017 నాటికి 71 స్థానాలకు బలం తగ్గింది… 2020 ఎన్నికల్లో మాత్రం 43 స్థానాలతో సరిపెట్టుకుంది. సంఖ్యా బలంగా తక్కువ ఉన్నా.. ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడం నితీష్ కుమార్ కు ప్లస్ పాయింట్ గా మారింది. కానీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆయన కోరిక మాత్రం తీరలేదు.