https://oktelugu.com/

Nithyananda’s ‘country’ : సొంత దేశం.. సొంత రాయబారి.. నిత్యానంద ‘కైలాస’ వేషాలు మామూలుగా లేవు

Nithyananda’s ‘country’ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లాడు నిత్యానంద. శిక్ష నుంచి తప్పించుకోవడానికి తాను మగాడినే కాదని ప్రకటించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత దేశం విడిచి పారిపోయారు. తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామి.. కొత్తగా కైలాస అనే దేశాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈశ్వడార్ దేశానికి చెందిన ఒక ద్వీపాన్ని కొనేసి దాన్ని ‘కైలాస’ దేశంగా మార్చేశాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే కైలాస అనే దేశం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 28, 2023 / 12:27 PM IST
    Follow us on

    Nithyananda’s ‘country’ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లాడు నిత్యానంద. శిక్ష నుంచి తప్పించుకోవడానికి తాను మగాడినే కాదని ప్రకటించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత దేశం విడిచి పారిపోయారు. తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామి.. కొత్తగా కైలాస అనే దేశాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈశ్వడార్ దేశానికి చెందిన ఒక ద్వీపాన్ని కొనేసి దాన్ని ‘కైలాస’ దేశంగా మార్చేశాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే కైలాస అనే దేశం అసలు ఉందా? ఉంటే దానికి గుర్తింపు ఉందా? ఆ దేశం కచ్చితంగా ఎక్కడ ఉంది? అని భారతీయులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అనూహ్యంగా కైలాస ప్రతినిధి ఒకరు ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు. ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస’ తరపున మాతా విజయ ప్రియా నిత్యానంద అనే మహిళ ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు.

    -భారత్‌పై ఆరోపణ..
    ఫిబ్రవరి 22న ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ ఆన్‌ ఎకనామిక్, సోషల్‌ అండ్‌ కల్చరల్‌ రైట్స్‌ (సీఈఎస్‌ఆర్‌) సమావేశం జెనీవాలో నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఐక్యరాజ్య సమితి తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. అందులో విజయ ప్రియ నిత్యానంద.. కైలాసకు శాశ్వత రాయబారి అనే హోదాలో కనిపించారు. ఆ సమావేశంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే విషయంపై చర్చ జరగగా.. ఆమె కూడా మాట్లాడారు. అంతే కాకుండా తమ దేశ వ్యవస్థాపకుడు నిత్యానందను ఆయన పుట్టిన భారత దేశం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు కూడా చేశారు.

    -తమది సార్వభౌమ దేశంగా ప్రకటన..
    కైలాస ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా విజయ ప్రియ నిత్యానంద ఐక్యరాజ్యసమితిలో ప్రకటించారు. నిత్యానంద హిందూయిజానికి అత్యున్నత మతాధికారని ఆమె సమావేశంలో తెలిపారు. నిత్యానంద మరుగున పడిన 10 వేల హిందూ సంప్రదాయాలను పునరుద్ధరిస్తున్నారని వెల్లడించారు. హిందూయిజాన్ని రక్షించడానికి, సరికొత్త విధానాలు రూపొందించడానికి కైలాస దేశం కృషి చేస్తోందని ఆమె ఐక్యరాజ్య సమితికి తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో కైలాస చాలా విజయవంతమైందని వెల్లడించారు.

    -నిత్యానందలా ఆహార్యం..
    ఇక ఐక్యరాజ్య సమితిలో పాల్గొన్న కైలాస రాయబారి విజయ ప్రియ నిత్యానంద ఆహార్యం పూర్తిగా నిత్యానందను తలపించేలా ఉంది. నిత్యానంద తరహాలోనే ఆమె సన్యాసిని వస్త్రధారణలో కనిపించారు. నిత్యానంద తరహాలోనే తలపాగా ధరించారు. మెడలో వివిధ రకాల పూసల దండలు వేసుకున్నారు. నుదుట బొట్టు ధరించారు. హిందూ తత్వాన్ని ప్రతిభింబించేలా విజయప్రియ సమావేశంలో కనిపించారు.

    -పారిపోయిన వ్యక్తి ప్రత్యేక దేశంలో ప్రత్యక్షం..
    2019 నవంబర్‌లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గుజరాత్‌ పోలీసులు నిత్యానంద ఆశ్రమం నుంచి ఒక చిన్నారి కిడ్నాప్‌ అయిన కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించారు. అదే సమయంలో దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద.. కైలాస అనే దేశాన్ని గుర్తుతెలియని ప్రదేశంలో నెలకొల్పారు. దానికి గుర్తింపు ఇవ్వాలని పలుమార్లు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి కూడా చేశారు. ఈ క్రమంలో కైలాస శాశ్వత రాయబారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    -కైలాస లేనే లేదన్న ఈక్వెడార్‌..
    కాగా, వివాదాస్పద మతగురువు నిత్యానంద తనకంటూ ప్రత్యేక దేశం, ప్రభుత్వం, జెండాను ఏర్పాటు చేసుకున్నారని, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం ప్రయత్నాలూ సాగుతున్నాయన్న కథనాలు చదివి చాలామంది విస్తుపోయారు. అయితే, ఈ కథనాలేవీ వాస్తవం కాదని ఈక్వెడార్‌ స్పష్టం చేసింది. ‘కైలాస’ను తమ నుంచి కొనుగోలు చేసిన భూభాగంలో నిత్యానంద ఏర్పాటు చేశారన్న వార్తలను కొట్టేసింది. ‘నిత్యానంద మమ్మల్ని ఆశ్రయం కోరినమాట నిజమే. శరణార్థిలా మా దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన దరఖాస్తు చేసుకొన్నారు. దాన్ని మేం తిరస్కరించాం’ అని ఈక్వెడార్‌ అప్పట్లో ప్రకటించింది. దీంతో ఆయన కరేబియన్ దీవుల్లో ఒకటైన హైతీకి తరలిపోయినట్టు తెలుస్తోందని భారత్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. తాజాగా ఆయన దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించడం, సమావేశానికి ఆహ్వానించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.