Gaddar Passed Away: గద్దర్.. ప్రజా యుద్ధనౌక, ఉద్యమాలకు పాటలతో పట్టం కట్టిన పోరు కేక.. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన ధిక్కార గొంతుక. అలాంటి వ్యక్తి చనిపోతే ఏ పత్రికైనా గొప్పగా ప్రజెంట్ చేయాలి. ఆయన జీవితంలో తెలియని కోణాన్ని పాఠకులకు తెలియజెప్పాలి. ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా పని అదే. ఆ గొట్టాల ఛానల్స్ సంగతి వదిలేయండి. వాటికి ఓ భాష లేదు. తీరూ తెన్నూ అంతకంటే లేదు. కానీ పత్రికలకు ఏం పుట్టింది? తమ రాజకీయ రంగుల్ని రోజూ ప్రచురిస్తున్నాయి కదా! తమ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలను వండి వారిస్తున్నాయి కదా! తెలంగాణ రగల్ జెండాగా వినతికెక్కిన గద్దర్ కన్నుమూస్తే ఆయన జీవిత విశేషాలలో సరికొత్త కోణాన్ని ప్రజెంట్ చేయలేరా? చూడబోతే పత్రికల కంటే సోషల్ మీడియానే నయంగా ఉంది. నిన్న కన్నుమూసిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఆయన జీవితంలో కొత్త కొత్త కోణాలను సోషల్ మీడియానే వెలుగులోకి తీసుకొస్తోంది.
గద్దర్ కన్నుమూసిన తర్వాత కవరేజ్ విషయాన్ని పరిశీలిస్తే మిగతా పత్రికలతో పోల్చితే ఆంధ్రజ్యోతి మెరుగ్గా ఉంది. ఒకప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈనాడు తన మార్కు చూపించేది. కానీ ఇప్పుడు తన ప్రొఫెషనలిజాన్ని గాలికి పోయే పేలపిండిని చేసింది. కనీసం గద్దర్ కు సరైన స్థాయిలో నివాళులు కూడా అర్పించలేకపోయింది. ఈనాడు దురవస్థ ఇంకా ఏ స్థాయికి దిగజారి పోతుందో.. ఇక ఉద్యమ పత్రికగా పేరుపొందిన నమస్తే కూడా ఈనాడు కంటే గొప్పగా ప్రజెంట్ చేయలేదు. అది దాని సార్ భజనలో ఆరి తేరిపోయింది. కనీసం గద్దర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని కనీస సోయి కూడా దానికి లేకుండా పోయింది. ఎంత సేపూ అది తన సార్ కోణంలోనే చూసింది.. కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను పేజీలకు పేజీలు అచ్చేసి.. తన బానిసత్వాన్ని మరొకసారి నిరూపించుకుంది.
ఇక సాక్షి.. అగ్గిపిడుగు లాంటి శీర్షిక ప్రయోగం చేసినప్పటికీ అది ఎందుకో అంతగా నప్పలేదు. నమస్తే, ఈనాడుతో పోలిస్తే అది కొంతలో కొంత నయంగానే కనిపించింది. గద్దర్ జీవిత విశేషాలను రాసే విషయంలో సోషల్ మీడియా అనే ప్రామాణికంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నిప్పులు చిమ్మింది. పొద్దు వాలిపోయింది అని గద్దర్ రాసిన పాటనే తనకు నివాళిగా శీర్షిక రూపంలో పెట్టింది. అంతేకాదు మొదటి పేజీలో దాదాపు ముప్పావు వంతు గద్దర్ కు కేటాయించింది. లోపల దాదాపు రెండు పేజీల వార్తలు కుమ్మేసింది. బహుశా దాని ఎడిటర్ కే శ్రీనివాస్ కు గద్దర్ తో ఉన్న ప్రత్యేక అనుబంధం వల్ల కావచ్చు. ఇటువంటి విషయంలో వేమూరి రాధాకృష్ణ పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు కాబట్టి ఆంధ్రజ్యోతి తిరుగులేని రేంజ్ లో నివాళులర్పించింది. ఇదే సమయంలో శాసనసభలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరణ వార్త తెలిసినప్పటికీ.. గద్దర్ కు నివాళి అర్పించలేదని ప్రత్యేకంగా ఉటంకించింది. కొంతకాలంగా అటు కేసీఆర్ కు, ఇటు రాధాకృష్ణకు కోల్డ్ వార్ జరుగుతోంది కాబట్టి ఇది ఊహించిందే.. వెలుగు పత్రిక కూడా తనకున్న స్పేస్ లో గద్దర్ కు ప్రయారిటీ ఇచ్చింది. మిగతా పత్రికల గురించి చర్చ ఇక్కడ అనవసరం.