ఆంధ్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ప్రస్తుతం మతం నీడలో సేద తీరుతున్నాయి. ఈ పరిణామాన్ని ‘ఓకే తెలుగు’ ముందుగానే పసిగట్టింది. జగన్ కి క్రైస్తవ గండం, కెసిఆర్ కి ఒవైసీ గండం ఉందనీ ఆ గండం నుంచి బయటపడటానికి ఏమి చేయాలో కూడా ఈ కాలమ్స్ లో గతం లో సూచించటం జరిగింది. ఇప్పుడు అనుకున్నంత పనీ జరిగింది. తెలంగాణా లో కన్నా ఈ పరిణామం ఆంధ్రలో జరిగింది. జరగటానికి కూడా ఒక కారణం వుంది. తెలంగాణా లో కెసిఆర్ పరమ హిందూ భక్తుడు కాబట్టి ఒవైసీ గండం జనం లోకి ఇంకా విస్తృతంగా వెళ్ళలేదు ( భైంసా లాంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగినప్పటికీ). అయితే జగన్ విషయం అలా కాదు. జగన్ స్వతహాగా క్రైస్తవుడు. అది ఆయన వ్యక్తిగతం, ఆయన ఏ మతాన్నయినా విశ్వసించే హక్కు వుంది. కాకపోతే పాలకుడుగా వున్నప్పుడు ఆయన పై ఆయన నమ్మే మతాన్ని ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలని ముందే హెచ్చరించాము. ఎందుకంటే మతమనేది సమాజం లో చాలా సున్నితమైన సమస్య. ఇప్పుడు జరుగుతున్న ఘటనల్లో ఆయనకు ప్రమేయం లేకపోవచ్చు. సాక్ష్యాలు లేనంతకాలం ఆ విధంగానే అనుకోవాలి. అయితే ప్రజల అవగాహన అలా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్ పై వుంది. అందునా తను వేరే మతానికి చెందినప్పుడు.
Also Read : అబ్బా.. ఏం చెప్తిరి.. అన్యాయాలపై సరెండరేనా?
అసలేం జరుగుతుంది?
జగన్ 2019 లో అధికారం లోకి వచ్చాడు. అప్పట్నుంచీ ఏదోమూల ఈ మత సమస్య రగులుతూనే వుంది. మొదట్లో హిందువులకు అతి పవిత్రమైన తిరుమల లో అన్యమత ప్రచారం జరుగుతుందని పెద్ద గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత వరసగా అనేక సంఘటనలు ఈ సంవత్సరం లో జరగటం తెలిసిందే. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇది మూడో సంఘటన. పిఠాపురం, కోటిలింగాల ఘటనలతోనే గోదావరికి అటూ ఇటూ వుద్రేకభరిత వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు అంతర్వేది ఘటన చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇటువంటప్పుడు మంత్రులు, పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి నోటికేదొస్తే అది మాట్లాడటం తో అది జనాల్లో ఆగ్రహావేశాలు తెప్పించింది. మొదట్లో ఇది మతిచలించిన వాడి చర్య అని, ఇప్పుడు తేనె కోసం తుట్టిని కదిలించటంతో ఏర్పడిందని వ్యాఖ్యానించటం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి తోడు ఇటీవలికాలంలో క్రైస్తవమత ప్రచారం ఎక్కువకావటం కూడా ప్రజల్లో ఆందోళనకు దారితీస్తుంది. ఇదంతా జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత జరుగుతుందని హిందువుల్లో బలంగా వ్యాప్తి చెందుతుంది. వాస్తవానికి ఆంధ్ర లో క్రైస్తవమత ప్రచారం చాప కింద నీరులాగా ఎప్పటినుంచో జరుగుతుంది. అయితే ఇంతకుముందు హిందువుల్లో దీనిపై దృష్టికి వచ్చినా పెద్దగా ప్రతిస్పందన లేదు. ఇప్పుడు హిందువుల ఆలోచనా ధోరణి లో మార్పు వచ్చింది. అది ఎలా జరిగిందో ఒక్కసారి పరిశీలిద్దాం.
Also Read : అప్పుల కుప్పలు.. తెలుగు రాష్ట్రాల తిప్పలు
కుహనా సెక్యులర్, ఉదారవాద సిద్ధాంతాలే కొంప ముంచాయి
హిందువులు స్వతహాగా ఉదారవాదులు. ప్రాచీనకాలం నుంచి అన్ని మతాలూ, విశ్వాసాలు కలిసి మెలిసి వేల సంవత్సరాలు సహజీవనం చేసిన చరిత్ర మనది. చివరకు మతాన్ని నమ్మని హేతువాదులు కూడా గౌరవంగా బ్రతికిన సమాజం ఇది. అటువంటి వాతావరణాన్ని స్వాతంత్రానంతర పాలకులు ( అంతకుముందు చరిత్ర ని విస్మరిద్దాం) తమ స్వార్ధానికి వాడుకోవటం జరిగింది. రాజ్యాంగ సభలో వుమ్మడి పౌర స్మృతికి గండి కొట్టిన దగ్గర్నుంచీ పరిశీలిస్తే మెజారిటీ మతస్థులైన హిందువులకు మైనారిటీ హక్కుల పేరుతో మిగతా మతస్తులకు అంతరాన్ని పెంచుతూనే వచ్చారు. చట్టాల్లో హిందువులకు, మిగతా మతస్తులకు తేడా చూపించటం రోజు రోజుకీ ఎక్కువకావటం తో హిందూ సమాజాన్ని ప్రతిబంబించే ధార్మిక సంస్థలకు, రాజకీయ పార్టీలకు ఆదరణ పెరిగింది. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. అనేక సంఘటనలు ఈ హిందూ సమీకరణ కు కారణమయ్యాయి. చివరకు మేము మెజారిటీ గా వున్న దేశంలోనే మాకు న్యాయం జరగటం లేదనే భావన హిందువుల్లో రోజు రోజుకీ పెరిగి చివరకు రామజన్మభూమి ఉద్యమ రూపం లో బయటకొచ్చింది. అక్కడనుంచి ఇది పెరుగుతూనే వచ్చింది. చివరకు ‘సెక్యులర్’ వాదులనుంచి అధికారం లాక్కొనే దాకా పరిణామాల్లో మార్పు వచ్చింది. అంటే మెజారిటీ హిందువుల్లో మన హక్కులు కాపాడుకోపోతే మనకు మనుగడ లేదనే భావన బలపడింది.
దీనికి ప్రధాన బాధ్యత కుహనా సెక్యులర్ , వుదారవాదులదే. ఏ ఘర్షణ జరిగినా హిందువులకు వ్యతిరేకంగా కొమ్ముకాయటం తో సహజంగా మధ్యస్తంగా వుండే అనేకమంది హిందువులు హిందూవాదుల వైపు మొగ్గుచూపారు. ఇదే జరిగిన గుణాత్మక మార్పు. కాశ్మీర్ విలీనం దగ్గర్నుంచి, కాశ్మీరీ పండిట్ల బహిష్కరణ వరకూ పాలకులు అనుసరించిన మెతక, అవకాశవాద వైఖరి అందరికీ తెలిసిందే. అలాగే గుజరాత్ అల్లర్లలో జరిగిన ఘోరకలి నాగరిక ప్రపంచానికే అవమానం. కాకపోతే అక్కడా సమగ్ర విశ్లేషణ బదులు మీడియా, మేధావి వర్గం ఒకవైపు కొమ్ముగాచినట్లు హిందువుల్లో అభిప్రాయ మేర్పడింది. గోధ్ర బోగీ దహనం లో చనిపోయిన 60 మంది ప్రాణాలు, తదుపరి అల్లర్లలో జరిగిన షుమారు వెయ్యిమంది ప్రాణాలు కూడా విలువైనవే ( అందులో ముస్లింలు, హిందువులు వున్నారు) . అది ముస్లిం అయినా , హిందువైనా, పోలీసయినా ప్రాణం ప్రాణమే. అలాగే దళితులు చనిపోయినప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగినా, బిజెపి ప్రభుత్వం లో జరిగినా, మమతా ప్రభుత్వం లో జరిగినా దారుణమే. కుహనా సెక్యులర్ వాదులు వీటన్నింటిలోనూ ఎంచుకొని ప్రతిస్పందించటం తో వాళ్ళ సిద్ధాంతం అవకాశవాదం గా ముద్రపడుతుంది. ఇకపోతే ‘ఉదార వాదులూ’ అంతే. ఎంచుకొని ప్రతిస్పందించటం, కొన్ని సందర్భాల్లో మౌనముద్ర వహించటం తెలిసిందే. అన్ని అభిప్రాయాలను వినే సహనం ఉండాల్సినచోట అసహనం తో వ్యవహరించటం ఉదారవాద సిద్ధాంతాన్నే తూట్లు పొడిచినట్లు. ఇటువంటి అవకాశవాద వైఖరి వలన అసలు సెక్యులరిజం, లిబరిలజం లపై హిందువుల్లో ఆదరణ తగ్గింది. అంతమాత్రాన ఆ సిద్ధాంతాలు తప్పుకాదు. వాటిని తమ స్వార్ధానికి వాడుకున్న వాళ్ళది తప్పు. మతం పేరుతో రాజకీయాలు చేయటం మాని మానవత్వం తో సమస్యలని చూసినప్పుడు ప్రజలు హర్షిస్తారు. అలా జరగనంత కాలం ప్రజలు ఇలా సమీకరింప బడుతూనే వుంటారు. ఆ నేపధ్యంలోనే హిందూ సమీకరణాన్ని చూడాల్సి వుంది. ఇది కరెక్టని ఎవరూ చెప్పజాలరు. కులం, మతం, ప్రాంతం, భాషా భేదం పోయి మనుషులందరూ సమానమనే సూత్రం ఆధారంగా చట్టాలు రూపొందించినప్పుడే ఈ గుర్తింపు రాజకీయాలు తగ్గుతాయి. అందులో భాగంగా ముందుగా వుమ్మడి పౌర స్మృతి ని అందరూ ఇప్పటికైనా ఆమోదింపచేసుకోవాలి.
Also Read : నాటి డమ్మీ నేతలే.. నేడు హీరోలు..
రాజకీయ పటం ఎలా మారుతుంది?
అంతర్వేది ఘటన తో బిజెపి-జనసేన మూడో ప్రత్యామ్నాయం మొదటిసారి చురుకైన పాత్ర వహించింది. తెలుగుదేశం దీన్ని తమకనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేసినా దాని గత చరిత్ర అందుకు భిన్నంగా వుంది. తెలుగు దేశం హయాం లో కూడా అనేక దేవాలయాలను కూల్చిన సంఘటనలు ఉండటంతో బిజెపి-జనసేన నాయకత్వం లో ఈ ఆందోళన జరగటం కొత్త పరిణామం. రాబోయే రోజుల్లో జరగబోయే మార్పులకు ఇది సంకేతమా అనిపిస్తుంది. హిందూ సమాజ జాగురూకత బిజెపి-జనసేన ఆధ్వర్యం లో సమీకృత మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం సిబీఐ దర్యాప్తు కి ఆదేశించినా పెద్దగా ప్రజలు హర్షించబోరు. కావాల్సింది హిందూ దేవాలయాల పై ఇటువంటివి జరగకుండా ఆపటం. ముందుగా ఇందులో కుట్ర కోణం ఉందన్న వైఎస్ ఆర్ సి పి నాయకులు అదేమిటో నిరూపించగలిగితే ప్రజలు హర్షిస్తారు. సిబిఐ వచ్చినా ఇందులో చేయగలిగింది పెద్దగా వుండదనిపిస్తుంది. కావాల్సింది ఇటువంటివి జరగకుండా ఆపటం ఒక్కటే. ఆ పని రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ముఖ్యంగా జగన్ ఇంకో అడుగు ముందుకేసి హిందువుల్లో పునర్విశ్వాసం కలిగించే చర్యలు చేపట్టకపోతే తన ప్రభుత్వానికి ఇది గండంగా పరిణమించే అవకాశముంది.
Also Read : బ్రేకింగ్: అంతర్వేది రథం దగ్ధంపై జగన్ షాకింగ్ నిర్ణయం
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: New turn in andhra politics with antarvedi issue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com