https://oktelugu.com/

ఆంధ్ర బిజెపి కి కొత్త నేత కావాలి

దేశంలో బిజెపి హవా వీస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో దాని వూసేలేదు. దీనికి రెండు కారణాలు. ఒకటి అధికారం లో బలమైన నాయకులు వుండటం. రెండు, బిజెపి స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ లేకపోవటం, ముఖ్యంగా ఆంధ్రా లో. తెలంగాణాలో డాక్టర్ లక్ష్మణ్ కొంతమేర తీవ్రంగానే ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ కుమార్ కి నాయకత్వ బాధ్యతను అప్పగించారు. ఇది వ్యూహాత్మకంగా సరయిన నిర్ణయమే. కెసిఆర్ ముందు తట్టుకొని నిలబడాలంటే ఆ […]

Written By:
  • Ram
  • , Updated On : June 8, 2020 / 12:15 PM IST
    Follow us on

    దేశంలో బిజెపి హవా వీస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో దాని వూసేలేదు. దీనికి రెండు కారణాలు. ఒకటి అధికారం లో బలమైన నాయకులు వుండటం. రెండు, బిజెపి స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ లేకపోవటం, ముఖ్యంగా ఆంధ్రా లో. తెలంగాణాలో డాక్టర్ లక్ష్మణ్ కొంతమేర తీవ్రంగానే ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ కుమార్ కి నాయకత్వ బాధ్యతను అప్పగించారు. ఇది వ్యూహాత్మకంగా సరయిన నిర్ణయమే. కెసిఆర్ ముందు తట్టుకొని నిలబడాలంటే ఆ మాత్రం దూకుడులేకపోతే ప్రజలు ఆదరించరు. రేవంత్ రెడ్డి ఓటు కి నోటు కేసు లో ఇరుక్కున్నా క్రేజ్ పెంచుకోగలిగాడంటే ఆ దూకుడే కారణం. అదేసమయం లో సామాజిక అంశాన్ని విస్మరించలేదు. తెలంగాణాలో సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గమయిన మున్నూరు కాపుల్ని దూరంచేసుకోకుండా తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్ కి పదవిని అప్పగించారు. కరీంనగర్, నిజామాబాదు లో బిజెపి ఎంపి లు గెలవటానికి ఈ వ్యూహమే పనిచేసింది. కాబట్టి అదే వ్యూహంతో దూకుడుగా ముందు కెళ్లాలని నిర్ణయించటం సరయినదే. ఫలితం ఎలావుంటుందో చూడాలి.

    ఆంధ్రలో పరిస్థితులు క్లిష్టంగా వున్నాయి 

    తెలంగాణ లో లాగా ఆంధ్రలో పరిస్థితులు లేవు. బిజెపి కి ఇంతకుముందు అధ్యక్షుడుగా వున్న డాక్టర్ లక్ష్మణ్ మొదట్నుంచీ బిజెపి , ఆర్ఎస్ ఎస్ వ్యక్తి. ఆంధ్రలో అలా కాదు. కన్నా లక్ష్మీనారాయణ ఫక్తూ కాంగ్రెస్ వ్యక్తి. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేకపోవటంతో బిజెపి లోకి వచ్చాడు. అదీ పదవిపై ఆశతోనే. అధ్యక్ష పదవి రాదని  తెలిసి వైఎస్ఆర్సిపి లో చేరబోవటం , ఫ్లెక్సి లు కట్టటం కూడా చక చకా జరిగిపోయింది. చివరి నిముషం లో బిజెపి హడావిడిగా కన్నా పేరును ప్రకటించటంతో బిజెపి లో కుదురుకు పోవలసి వచ్చింది. ఇది ప్రజలకు తెలియందికాదు. ఓ విధంగా చెప్పాలంటే బిజెపి ఈ మొత్తం వ్యవహారం లో అప్రతిష్టపాలయ్యింది. వాళ్ళ వ్యూహానికి ప్రధానకారణం సామాజిక సమీకరణ లే. తెలంగాణ లో లాగా ఆంధ్రలో కూడా కాపు వర్గం సంఖ్యాపరంగా అధికంగా ఉండటంతో ఈ సామాజిక వర్గం వ్యక్తి అధ్యక్షుడయితే రాజకీయలబ్ది వస్తుందని ఊహించారు. అంతవరకూ వాళ్ళ వ్యూహాన్ని రాజకీయకోణం లో అర్ధంచేసుకోగలం కానీ అది అన్ని సందర్భాల్లో మక్కికి మక్కి వర్తించదని అర్ధంచేసుకోలేకపోయారు.

    కన్నా పై అప్పటికే ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోవటం ఒక కారణం కాగా , జగన్ పార్టీలో చేరటానికి ఫ్లెక్సీ లు కట్టిన వ్యక్తిని ఏకంగా అధ్యక్ష స్థానం లో కూర్చోపెట్టటం ప్రజలు హర్షించలేదు. అదే మొదట్నుంచీ బిజెపి లోనూ, ఆర్  ఎస్ ఎస్ లోనూ వున్న వ్యక్తి కి ఇచ్చివుంటే దీర్ఘకాలం లో   కొంత ప్రయోజనం వుండేది. ఉదాహరణకు సోము వీర్రాజు చాలా దూకుడుగా చంద్రబాబుపై ఉండేవాడు. అదీగాక కాపులు అధికంగా వుండే గోదావరి జిల్లాకు సంబంధించినవాడు. ఎటూ తక్షణం బిజెపి అధికారం లోకి వచ్చే అవకాశం లేనప్పుడు ఆ ప్రయోగమే దీర్ఘకాలం లో ఉపయోగపడేది. పాత బిజెపి క్యాడరు లో నూతనోత్సాహం వచ్చివుండేది. కన్నాను చేయటంతో పాత బిజెపి వర్గాల్లో ఉత్సాహం కొరవడింది. అటు ప్రజల్లో ఆదరణ లేకుండా, ఇటు క్యాడర్ లో ఉత్సాహం లేకుండా రెండింటికి చెడ్డ రేవడిలాగా బిజెపి పరిస్థితి మారింది.

    ఇంకో ముఖ్యవిషయం , తెలంగాణాలో లేని ప్రత్యేక పరిస్థితి ఆంధ్రాలో తలెత్తింది. అది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం. అప్పటికే రెండు ప్రధాన పార్టీలు రెండు సామాజిక వర్గాల నాయకత్వాన ఉండటంతో ఇకమిగిలింది కాపులే. ఆ విధంగా బిజెపి వ్యూహం కరేక్టయినా పవన్ కళ్యాణ్ పాత్రని విస్మరించింది. కాపులు పవన్ కళ్యాణ్ వైపు సహజంగానే ( తను కుల సమీకరణలకు వ్యతిరేకమని చెప్పినా ) కొంత మొగ్గుచూపిస్తారనేది వాస్తవం. అటువంటప్పుడు అంతకన్నా బలమైన కాపు నాయకుడినైనా బరిలోకి దించగలగాలి లేకపోతే ఆ తర్వాత బలంగా వున్న బిసి వర్గం నుంచి ( దళితులు అప్పటికే జగన్ వైపు సమీకరించ బడ్డారు కాబట్టి) ఎన్నుకోవాలి. కాబట్టి ఎంతో రాజకీయ అనుభవముందని చెప్పుకొనే బిజెపి ఆంధ్ర రాజకీయాల్లో తప్పటడుగులు వేసింది. అటు క్యాడర్లో పూర్తి నైరాశ్యం అలుముకుంది. దానితోపాటు ప్రస్తుత రాష్ట్ర సమీకరణలతో రాష్ట్ర బిజెపి కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. కాకపోతే ఒకే ఆశాజనక అంశమేమిటంటే పవన్ కళ్యాణ్ తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవటం. దానితో అసలేమీ లేనిచోట ముందు ముందు అవకాశాలు మెరుగు పడతాయనే ఆశల కలలు వున్నాయి.

    కొత్త అధ్యక్షుడ్ని తక్షణమే నియమించాలి 

    ఈ ఆశల కలలు నిజం కావాలంటే రాష్ట్ర బిజెపి నిర్మాణాన్ని చక్కదిద్దుకోవాలి. అందుకు ఇప్పుడున్న యధాతధ స్థితి మారాలి. కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాలి. అది తక్షణావసరం. ఆ పనిచేయకుండా పవన్ కళ్యాణ్ తో జతకట్టినా వచ్చే ప్రయోజనేమేమీ వుండదు. బిజెపి క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింప గలిగే నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలి. అది కాపు సామాజిక వర్గం నుంచా లేక పవన్ కళ్యాణ్ తో పొత్తు నేపధ్యంలో బిసి వర్గం నుంచా అనేది వ్యూహాత్మక నిర్ణయం జరగాలి. ఆంధ్ర లో రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కీలకంగా పనిచేస్తాయి. ఇప్పటికే బిజెపి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించాడు. తెలంగాణలో కూడా ఆ వరసలోనే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర వంతు వచ్చింది. ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రక్రియ చేపడితేనే పవన్ కళ్యాణ్ తో పొత్తు వలన ప్రయోజనం వుంటుంది. ఇంతకన్నా మంచి తరుణం కూడా వుండదు. తెలుగుదేశం మొత్తం చరిత్రలోనే అత్యంత బలహీనంగా వుంది ఇప్పుడే. బిజెపి కిది బంగారు అవకాశం. సరయిన సమయం లో నిర్ణయం తీసుకోకపోతే తిరిగి పోటీ జగన్-టిడిపి మధ్యనే ఉండిపోతుంది. బిజెపి నాన్పుడు ధోరణితో వుంటే బిజెపి తో పాటు పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకి కూడా నష్టం జరిగే అవకాశముంది. ఇప్పటికైనా బిజెపి నిద్రలేచి ప్రజలకు మూడో ప్రత్యామ్నాయాన్ని కూడా ముందుంచుతారని ఆశిద్దాం.