Nellore Politics: జగన్ కు చికాకు పెడుతున్న నెల్లూరు రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు వైసిపి నేతలు ముందుకు రావడం లేదు. ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : July 28, 2023 11:56 am

Nellore Politics

Follow us on

Nellore Politics: నెల్లూరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు జగన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఏకపక్షంగా నిలిచిన నెల్లూరు జిల్లా అంటేనే ఇప్పుడు జగన్ హడలెత్తిపోతున్నారు. నేతలు ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు ఉన్న నాయకుల్లో సైతం విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరి కింద ఒకరు గోతులు తవ్వుకుంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ అన్నింటికీ వివాదాస్పదమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ టిక్కెట్ ఇవ్వకూడదని జిల్లా వైసీపీ నేతలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు వైసిపి నేతలు ముందుకు రావడం లేదు. ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో ఆదాలకు అక్కడ పార్టీ బాధ్యతలు అప్పగించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి కోసం పార్టీ వెతుకులాట ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సరైన అభ్యర్థి అని జగన్ డిసైడ్ అయ్యారు.

అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయనని వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ ఎదుటే తేల్చేశారు. ఇటీవల ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు. నెల్లూరు రాజకీయాల గురించి చర్చించారు. ఆదాల నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో… ఎంపీగా పోటీ చేయాలని వేంరెడ్డిని జగన్ కోరారు. అయితే తాను పోటీ చేయలేనని వేంరెడ్డి తేల్చేశారు. ఒకవేళ తాను పోటీ చేయాలని భావిస్తే మాత్రం నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించాలని వేంరెడ్డి కోరారు. అనిల్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని… వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్కు చెప్పినట్లు సమాచారం. దీనికి ఆధాల సైతం ఏకీభవించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయంపై జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.