Times Now Survey AP: అసలే అధికారంలో ఉన్నారు..ఆపై 30 సంవత్సరాలు తమదేనని గంటాపధంగా చెబుతున్నారు. వైనాట్ 175 అని శపధం చేస్తున్నారు. ఏంటీ ధైర్యం అంటే ప్రజలకు ఇంతకంటే పాలించేదెవరు?. ఇంటింటికీ నగదు పంచి అందరి కళ్లల్లో ఆనందం చూస్తుంటే..ఇంకా అనుమానం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అధినేత నుంచి గ్రామస్థాయి వరకూ అంతులేని విశ్వాసం.. అపార నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకూ కోడై కూస్తుంటే ఇంకా మా వైపు అనుమానపు చూపులేలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక తమకు తిరుగులేదని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు వచ్చిందే తడవు 175కి 175 చూడండి అంటూ సవాల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ తో అదరగొడుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ అంటూ జాతీయ మీడియా టైమ్స్ నౌ సర్వే వెల్లడించేసరికి.. వైనాట్ 175 పదిలమైపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో పాతదైన నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెర వెనుక మంత్రాంగమే ఈ సర్వేనంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా.. వై నాట్ అంటూ వైసీపీ కొట్టిపారేస్తోంది. జాతీయ పేరు మోసిన మీడియా విపక్షాలకు కనీస ప్రాతినిధ్యం లేదని చెప్పేసరికి మనల్ని అపేదెవరు.. అడ్డుకునేదెవరు? అంటూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. వారు పెడుతున్న పోస్టింగులకు ప్రతిస్పందించేవారు లేకపోతున్నారు. కామెంట్స్ పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
జగన్ ధైర్యానికి.. సర్వేలకు చాలా దగ్గర సంబంధం ఉంది. వైనాట్ 175 స్లోగన్ కు తాజాగా టైమ్స్ నౌ సర్వే కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే జగన్ వైనాట్ 175 అని చెప్పిన దానికి ప్రాతిపదికగా తీసుకున్నారా? లేకుంటే నిజంగా జనాలు నాడీ పట్టుకున్నారా? అన్న సెటైర్లు పడుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రచారానికి రూ.25 కోట్ల ముట్టజెప్పినందుకా ఈ ప్రచారం అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎలా ఉన్నా సరే వైసీపీ జనాలకు మాత్రం వైనాట్ 175 నినాదాన్ని తీసుకెళ్లే బాధ్యత టైమ్స్ నౌ తీసుకుంది. ఏకంగా వీడియోల ప్రోమోలు పెట్టి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. జగన్ ధైర్యానికి, జనాలకు మధ్య జాతీయ మీడియా సంస్థలు ఉన్నట్టు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ ధైర్యం నిజమవుతుందా? విపక్షాల అనుమానాలు వాస్తవమా? అన్నది తేలాల్సి ఉంది.