Pawan Kalyan- National parties: ఏపీ ప్రయోజనాల కోసం అవసరమైతే వ్యూహం మార్చుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. బీజేపీ అగ్రనేతలకు నేరుగా హెచ్చరిస్తూ గట్టి సంకేతాలే పంపారు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీల జాబితాలో బీజేపీ చేరిందని హెచ్చరిస్తూనే.. సరిదిద్దుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అయితే పవన్ హెచ్చరికలు ఇప్పుడు బీజేపీయేతర పార్టీలకు వినసొంపుగా వినిపించాయి. బీజేపీని కట్టడి చేయ్యాలంటే పవనే సరైన వ్యక్తి అని డిసైడ్ అయ్యారట కొందరు జాతీయ నేతలు. పొలిటికల్ గా క్లీన్ ఇమేజ్ ఉండడం.. లక్షలాది మంది ప్రజాభిమానం ఉండడంతో పవన్ ఏది మాట్లాడిన క్షణాల్లో సర్క్యులేట్ అవుతోంది. అయితే అటువంటి నాయకుడు ఏపీకే పరిమితం కాకూడదని.. జాతీయ స్థాయిలో ఉండాలని దేశ వ్యాప్తంగా మిగతా రాజకీయ పక్షాలు బలంగా కోరుకుంటున్నాయట. వామపక్షాలతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్ వంటి నేతలు ఇప్పటికే పవన్ కు టచ్ లోకి వచ్చినట్టు సమాచారం.

ప్రధాని మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తూ వస్తోంది. చిన్న చిన్న పార్టీలను కబళిస్తూ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకొని భారీగానే లబ్ధిపొందుతోంది. ఈ క్రమంలో రాజకీయ నిర్ణయాలు ఆ పార్టీ చరిత్రను మసకబార్చుతున్నాయి. అయినా ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం వెనక్కి తగ్గడం లేదు. అటు రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసే క్రమంలో కేంద్ర నిఘా సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న అపవాదు ఉంది. సీబీఐ, ఈడీ వంటి వాటిని ఎగదోస్తుండడంతో కాకలు తీరని రాజకీయ నేతలు సైతం సైలెంట్ కావాల్సి వస్తోంది. కేంద్ర పెద్దలకు మోకరిళ్లాల్సి వస్తోంది. దీనికి కారణం వారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం. అందుకే పవన్ లాంటి క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడు జాతీయ స్థాయిలో తెరపైకి వస్తే.. బీజేపీ దుందుడుకు చర్యలకు కొంత బ్రేక్ ఇచ్చే అవకాశముంది.

కానీ ప్రస్తుతం ఏపీలో జనసేనను బలోపేతం చేసే పనిలో పవన్ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైతే భావసారుప్యత కలిగిన పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని చెప్పారు. దీంతో టీడీపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని సంకేతాలిచ్చారు. అయితే ఏపీతో పాటు జాతీయ రాజకీయాల్లో ముద్ర వేయాలని భావిస్తున్న పవన్ ఎంపీ స్థానాల నుంచి కూడా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని చూస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మచిలీపట్నం మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ, నాగబాబు వంటి నేతలను ఎంపీలుగా పోటీచేయించి జాతీయ రాజకీయాల్లో పంపించాలని వ్యూహం రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల తరువాత తనతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు.