‘తెలుగు మా అధ్యక్ష పదవి’ కోసం ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మధ్యలో నరేష్, ప్రకాష్ రాజ్ పై వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ ‘మా’ సభ్యుల మధ్య గొడవలు మొదలవ్వడానికి కారణం ఓ ముఠా నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరు ఆ ముఠా నాయకుడు ? ఈ ప్రశ్నకు నరేష్ సమాధానమిచ్చారు.
నరేష్ మాటల్లోనే.. ‘‘75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓ ఆర్గనైజేషన్ ఈవెంట్ లో భాగంగా ‘మా’ అసోసియేషన్ లోని కొందరు సభ్యులు ఏదో చేయాలని భావించారు. అందులో భాగంగా ఓ రోజు నాకు తొమ్మిదిన్నరకు జీవిత నుంచి ఫోన్ వచ్చింది. పది లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటున్నామని జీవిత ఫోన్ లో చెప్పింది. అదెవరి డబ్బు.. నీదో నాదో కాదు కదా, వద్దు అని చెప్పాను.
ఎందుకంటే.. అసోసియేషన్ డబ్బు ఖర్చు పెట్టాలి అంటే.. ఒక ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టాలి. అందుకు కనీసం మూడు రోజులు సమయం పడుతుంది. కానీ జీవితగారికి అవేమి తెలియవు. పొద్దున ఫోన్ చేసి పన్నెండు గంటలకు మీటింగ్ పెట్టుకుని, సాయంత్రం చెక్ ఇచ్చేయాలి అంటారు. జనరల్ సెక్రటరీతో పాటు ప్రెసిడెంట్ గా నేను, ట్రెజరర్ గా రాజీవ్ కనకాల కచ్చితంగా సంతకం పెట్టాలి. కానీ మేము అప్పుడు పెట్టలేదు. మరి చెక్ ఎవరు ఇచ్చారు ? చెక్ లేకుండానే బ్లాంక్ కవర్ ఇచ్చారు. అది చీటింగ్ కాదా ?
నిజానికి రాజశేఖర్‌గారికి ప్రెసిడెంట్ అవ్వాలని ఎప్పటి నుంచో ఓ కోరిక ఉంది. ఓ ముఠా ఆయన కోరికకు సపోర్ట్ గా నిలిచింది. ఆ ముఠా నాయకుడే బెనర్జీ. ఆయన వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అమెరికాలో ట్రిప్ కు మా సభ్యులు వెళ్లారు. వెళ్లినందుకు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కానీ వాళ్ళు సంపాదించింది ఎంతో తెలుసా ? కోటి రూపాయలు. ఎవరైనా కోటి రూపాయల కోసం ఆరు కోట్ల రూపాయలను ఖర్చు పెడతారా ? ఇక్కడే నేను సీరియస్ అయ్యాను. వాళ్ళు గొడవలు చేశారు.
ముఖ్యంగా బెనర్జీ ఓ బ్యాచ్ ను తయారుచేసుకుని ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ గొడవలు చేయడానికి ప్రయత్నాలు చేశాడు. వీళ్లు అందరూ కలిసి హీరో రాజశేఖర్ ను ప్రభావితం చేశారు. నన్ను దింపేసి రాజశేఖర్ ను ప్రెసిడెంట్ ని చేయాలని చాలా చేశారు’ అంటూ నరేష్ చెప్పుకొచ్చారు.
