Narendra Modi: 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తర భారత దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీచింది. దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని విధంగా 8 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. దీంతో అధిష్టానం స్థానిక నాయకత్వం పనిచేసిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే ఒరవడి వచ్చే రోజుల్లో కూడా కొనసాగించాలని సూచించింది. అయితే ఆ దిశగా స్థానిక నాయకత్వం, పార్లమెంటు సభ్యులు పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ డి ఏ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీల పనితీరు పట్ల ప్రస్తావన వచ్చింది. ఈ చర్చలో తెలంగాణ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ సభ్యుల పనితీరు పట్ల నరేంద్ర మోడీ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పని చేయడం సరికాదని సూచించారు. అంతేకాదు ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని.. ఆయనతో పోల్చి చూస్తే టీ బీజేపీ ఎంపీలు సరిగ్గా పనిచేయడం లేదని మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అసదుద్దీన్ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ గా ఉందని.. ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రాంతానికి చెందిన బిజెపి పార్లమెంటు సభ్యులు పనితీరు మార్చుకోవాలని ప్రధానమంత్రి సూచించినట్టు తెలుస్తోంది. ఈ అల్పాహార విందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే సందర్భం వచ్చినప్పటికీ కూడా ఎంపీలు పట్టించుకోకపోవడం పట్ల ప్రధానమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు చాలామంది సరిగా పనిచేయడం లేదని భారతీయ జనతా పార్టీ అధిష్టానం వద్ద నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది . ఆ నివేదికను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించినట్టు సమాచారం.ఇప్పటికైనా టీ బీజేపీ ఎంపీలు పనితీరు మార్చుకోవాలని మోడీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో చంద్రబాబు పాలనకు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పరిపాలన అద్భుతంగా ఉందని.. అందువల్లే ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రధానమంత్రి కితాబు ఇచ్చారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి హెచ్చరికలతోనైనా టీ.బీజేపీ ఎంపీలు పనితీరు మార్చుకోవాలని.. పనితీరు మార్చుకుంటేనే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.