Modi Apology To Newlyweds West Bengal: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుంది. ఆ భద్రతను దాటి నరేంద్ర మోడీని కలవడం అంత ఈజీ కాదు. ఆ భద్రతను దాటుకొని నరేంద్ర మోడీ కూడా బయటికి రాలేరు. కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్లో శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు.. వాతావరణంలో ఊహించని మార్పులు ఏర్పడ్డాయి. దీంతో నరేంద్ర మోడీ ప్రయాణించే హెలికాప్టర్ ను నిలుపుదల చేశారు. అప్పటికప్పుడు ఆయన కోసం ప్రత్యేక వాహన శ్రేణి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది ఆందోళన చేయడంతో నరేంద్ర మోడీ కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోవలసి వచ్చింది. అప్పుడు ప్రత్యేక భద్రతా దళం నరేంద్ర మోడీకి రక్షణ కల్పించింది. వాస్తవానికి నాడు ఎస్పీజీ ప్రోటోకాల్ గనక లేకుండా ఉండి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ప్రత్యేక భద్రత దళం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అక్కడ బిజెపి అభ్యర్థుల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక రిసార్ట్లో జరుగుతున్న పెళ్లి వేడుక వద్దకు వెళ్లారు. ప్రత్యేక భద్రతా బృందాన్ని దాటుకుని మరీ పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ వివాహం జరిగిన నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అంతేకాదు అక్కడున్న వారందరికీ క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఉత్తర బెంగాల్ ప్రాంతంలో ఏప్రిల్ 23న మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఏప్రిల్ 12న సిలిగుడి ప్రాంతానికి చేరుకున్నారు. శనివారం బగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి 13 కిలోమీటర్ల మేర రోడ్డు షో నిర్వహించారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ బస చేయడానికి ప్రాంతంలో మే ఫెయిర్ టీ రిసార్ట్ లో ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి రావడంతో శుక్రవారం నుంచే అక్కడ వాతావరణ మారిపోయింది. భద్రత బృందం ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది.
ఆ ప్రాంతంలోనే ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడి వివాహం జరుగుతుంది. దీంతో ఆ పెళ్లి వేడుకకు వచ్చిన వారంతా కూడా భద్రత బృందం చేసిన తనిఖీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. భద్రత బృందం కఠినమైన ఆంక్షలు విధించడంతో.. పెళ్లికి వచ్చిన బంధువులు మొత్తం ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన నరేంద్ర మోడీ ఆ పెళ్లి వేడుక జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.
“నేను ఈ ప్రాంతానికి వచ్చాను. నేను రావడం వల్ల భద్రత బృందం తనిఖీలు నిర్వహించింది. దీనివల్ల మీకు అసంతృప్తి ఏర్పడింది. మీకు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నాను. దయచేసి మీరు నన్ను క్షమించండి. మీకు అసౌకర్యం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. వారి విధి నిర్వర్తించారు. మీరు వేరే విధంగా అనుకోకండి. మీ నూతన దంపతులకు నా శుభాకాంక్షలు. మీ భావి వైవాహిక జీవితం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని” నరేంద్ర మోడీ వారితో వ్యాఖ్యానించారు.
