Nara Lokesh: ఏపీ రాజకీయాలు ముట్టుకుంటే కాలిపోయేలా తయారయ్యాయి. ఎవరిని కదిలించినా బూతులే వినసొంపుగా వినిపిస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కాస్త పెద్దరికంతో రగిలిపోయాడు. మాకు రాదా ఆవేశం.. మీ బూతులు వింటూ సహిస్తాం.. భరిస్తాం అని అన్నాడు. కానీ ఆయన కుమారుడు కాబోయే టీడీపీ అధినేత నారా లోకేష్ మాత్రం నాకు అంత ఓపిక లేదని.. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు తీవ్రస్వరంతో హెచ్చరించడం విశేషం.
నారా లోకేష్ తాజాగా మంగళగిరిలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయని.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందన్నారు. ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడుతున్నామన్నారు. ఏపీ నుంచి ఎక్కువగా గంజాయి వస్తుందని హైదరాబాద్ సీపీ చెప్పారని.. దీనిపై కేసీఆర్ స్పందించినా జగన్ నోరు మెదపడం లేదన్నారు.
నాలుగు అద్దాలు పగిలితే భయపడుతామని భావిస్తున్నారా? దాడులు చేసినంత మాత్రాన మేం భయపడం.. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి’ అని లోకేష్ వైసీపీ శ్రేణులను హెచ్చరించడం విశేషం.
టీడీపీ ఆఫీసులపై మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ యూనివర్సిటీ అని.. మా అధినేతకు ఉన్న సహనం నాకు లేదన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారని.. సరైన శిక్ష పడే వరకూ మిమ్మల్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎమెర్జెన్సీ విధించాలని హెచ్చరించారు.