Nara Lokesh: జైల్లో చంద్రబాబు.. క్యూలో నారా లోకేష్

వరుస కేసులతో తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడమే సిఐడి లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ తో పాటు మరికొందరిపై అభియోగాలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : September 26, 2023 4:00 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: ఏపీలో అక్రమ కేసుల పర్వం నడుస్తోంది. స్కిల్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ చుట్టూ ఏపీ సర్కార్ ఉచ్చు బిగిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14 గా చూపుతూ సిఐడి కేసు నమోదు చేసింది. ఏసిబి కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ సిఐడి మెమో దాఖలు చేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు నారా లోకేష్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది.

వరుస కేసులతో తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడమే సిఐడి లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ తో పాటు మరికొందరిపై అభియోగాలు ఉన్నాయి. ఈ తరుణంలో తదుపరి అరెస్టు నారా లోకేష్ దేనిని తేలడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వద్దని సిఐడి కోరింది. దీంతో బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై చంద్రబాబు లాయర్లు కౌంటర్ దాఖలు చేయగా.. దానిపై విచారణ బుధవారమే చేపడతామని స్పష్టం చేసింది కోర్టు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఇప్పటికీ చంద్రబాబును రెండు రోజులు పాటు సిఐడి కస్టడీకి తీసుకుంది. అయితే సరైన సమాచారం రాలేదని.. ఇంకా విచారించాల్సిన అవసరం ఉందంటూ సిఐడి మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.

మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బుధవారం విచారణ చేపడతామని తెలిపారు. ప్రధానంగా 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా తనను అరెస్టు చేశారని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని కోరారు. ఈ తరుణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ 14 గా చూపుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత గత కొద్దిరోజులుగా లోకేష్ ఢిల్లీలో గడుపుతూ వచ్చారు. యువ గళం పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ తరుణంలో లోకేష్ ను టార్గెట్ చేసుకొని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోఇరికించాలని చూస్తోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.