Nara Lokesh : చిలకలూరిపేట సభలో లోకేష్ ను ఎందుకు పక్కన పెట్టారు? వేదిక పైకి ఎందుకు పిలవలేదు? ప్రసంగించే ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సైతం అనుమానాలు ఉన్నాయి. అసలు సభలో లోకేష్ కనిపించలేదు. ఆయన ప్రసంగం కూడా లేదు. ప్రధానికి స్వాగతం పలికే సమయంలో లోకేష్ చివరిలో ఉండిపోయారు. తరువాత ఆయనకు వేదికపైకి పిలవలేదు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? వ్యూహాత్మకమా?అన్నది తెలియాల్సి ఉంది.
వాస్తవానికి చిలకలూరిపేట సభకు సంబంధించి సమన్వయ బాధ్యతలను లోకేష్ చూసుకున్నారు. టిడిపి, బిజెపి, జనసేన నాయకులతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల సమన్వయ బాధ్యతలు లోకేష్ కు అప్పగించారు. సభకు సంబంధించి ఏర్పాట్ల పనులకు లోకేష్ శంకుస్థాపన చేశారు. అటు జన సమీకరణ బాధ్యతలను సైతం లోకేష్ తీసుకున్నారు. దాదాపు 900 ఆర్టిసి బస్సులను జన సమీకరణకు వినియోగించారు. మూడు పార్టీల కీలక నేతలను సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లను లోకేష్ నిత్యం పర్యవేక్షించారు. కానీ భారీ బహిరంగ సభలో లోకేష్ కు ప్రాధాన్యత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏమిటన్న దానిపై బలమైన చర్చ నడుస్తోంది.
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయింది. పైగా కాంగ్రెస్ తో చేతులు కలిపింది. అప్పట్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. ఏపీ సన్రైజ్ తో వెలిగిపోతుందంటూ లోకేష్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల క్రమంలో ఈసారి లోకేష్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు బిజెపి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. తమిళనాడులో స్టాలిన్ వంటి వారు వారసత్వ రాజకీయాలపై వచ్చారని ప్రధాని మోదీ తరచు ఆరోపణలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ సైతం వారసత్వ రాజకీయాల్లో చిక్కుకుందని విమర్శలు చేస్తుంటారు. ప్రధాని మోదీకి వారసత్వ రాజకీయాలు నచ్చకపోవడం వల్లే లోకేష్ పెద్దగా కనిపించలేదని తెలుస్తోంది. సభలో మూడు పార్టీల నేతలు మాట్లాడినా… అన్ని తానై సభను సక్సెస్ చేసిన లోకేష్ కు ప్రసంగించే అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే లోకేష్ కు అవకాశం ఇవ్వకపోవడం అనేది ఊహాగానమే తప్ప.. నిర్దిష్టమైన కారణాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరికి ఎవరు అడగలేక పోతున్నారు. దీంతో ఇదో చర్చనీయాంశంగా మారింది.