Nara Bhuvaneswari: ఏపీ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎట్టకేలకు స్పందించారు. తన భర్త కన్నీళ్లు పెట్టుకోవడాన్ని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ పై మీడియా చానెళ్లు అడిగిన ప్రశ్నలకు ఆమె పరోక్షంగా స్పందించారు. నాకు ఎవరి క్షమాపణలు అక్కరలేదని, తన భర్త ఎటువంటివారో అందరికీ తెలుసునన్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలకు నారా చంద్రబాబు అంటే ఏంటో తెలుసని స్పష్టం చేశారు. అయితే, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా గత నెలలో వరదల ద్వారా నష్టపోయిన పలు కుటుంబాలకు ఆమె ఆర్థిక సాయం అందించారు.
కర్ర విరగకూడదు కానీ పాము చావాలి అన్న చందంగా నారా భువనేశ్వరి వైసీపీ నేతల పేర్లు ఎత్తకుండా తను చెప్పాల్సింది మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. తనకు ఎవరి క్షమాపణలు అవసరం లేదని, కానీ మహిళల పట్ల హుందాగా ప్రవర్తించాలన్నారు. తమపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని వాటిని తాము పట్టించుకోమన్నారు. కానీ ఆ సమయంలో చాలా బాధపడ్డామని తెలిపారు. సొసైటీకి పనికొచ్చే విమర్శలు చేయాలని పనికిరాని విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. మహిళలను చులకనగా చూస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు.
Also Read: Chandrababu: వంశీకి చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం.. ఏపీలో రసవత్తర రాజకీయాలు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నారా భువనేశ్వరి డిమాండ్ చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు నేరుగా ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. తాము ప్రజాసేవకే అంకితం అని మరోసారి స్పష్టం చేశారు. తన భర్త కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో నందమూరి ఫ్యామిలీ తమకు అండగా నిలిచిందన్నారు. తప్పు చేసిన వారు ఎవరిపాపన వారే పోతారన్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇటీవల వరదల కారణంగా చనిపోయిన 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఏన్టీయార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వారికి అభినందనలు తెలిపారు.